సాహస మహిళకు సీఎం ప్రశంసలు
అవినీతిపరుడైన పోలీసుకు లంచం ఇవ్వడానికి నిరాకరించడమే కాక.. అతడి మీద ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి, అతడి ఉద్యోగం ఊడగొట్టించిన సాహస మహిళను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసల్లో ముంచెత్తారు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసు విభాగానికి చెందిన సతీష్ చంద్ర అనే హెడ్ కానిస్టేబుల్.. రమణ్దీప్ కౌర్ అనే మహిళను రూ. 200 లంచం అడిగాడు. ఆమె ఇవ్వనని చెప్పినందుకు ఆమెపై ఇటుక విసిరాడు. అయినా ఆమె ధైర్యంగా అతడిని పట్టుకుని, పారిపోకుండా చూశారు. ఈ మొత్తం తతంగం అంతా వీడియోలో రికార్డు కావడంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది.
తర్వాత అతగాడిపై ఆమె పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ తనకు కనీసం ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదని, ఆస్పత్రిలో సరైన చికిత్స కూడా చేయించలేదని ఆమె సీఎం కేజ్రీవాల్కు ఫిర్యాదు చేశారు. కౌర్ దంపతులను సచివాలయానికి పిలిపించిన కేజ్రీవాల్.. ఆమె ధైర్యాన్ని అభినందించి.. ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పిస్తానని, తగిన చికిత్స కూడా చేయిస్తామని హామీ ఇచ్చారు. తొలుత హెడ్ కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు, తర్వాత అతడిని అరెస్టుచేసి చివరకు ఉద్యోగం నుంచి కూడా తొలగించారు.