కేజ్రీవాల్ రాజీనామా కోసం ధర్నా చేస్తా: అన్నాహజారే
భూములకు సంబంధించిన కుంభకోణాల ఆరోపణలు, అవినీతి ఆరోపణలు నిజమని తేలితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను తీసేయాలని, లేదా ఆయన రాజీనామా చేయాలని తాను డిమాండ్ చేస్తానని, అందుకోసం అవసరమైతే ఆందోళన కూడా చేస్తానని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే అన్నారు. అయితే, మాజీ మంత్రి కపిల్ మిశ్రా మాత్రం తన పదవి పోయిన తర్వాతే కేజ్రీవాల్‌పై ఈ ఆరోపణలు చేశారని చెప్పారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే డబ్బులు చేతులు మారి ఉంటే, అప్పుడే ఎందుకు అధికారులను అప్రమత్తం చేయలేదని అన్నాహజారే ప్రశ్నించారు.
ఈ కేసులో విచారణ గట్టిగా జరగాలని, ఒకవేళ కేజ్రీవాల్ తప్పు చేసినట్లు రుజువైతే తాను జంతర్ మంతర్ వద్ద నిర్వహించే ఆందోళనలో స్వయంగా కూర్చుని అతడి రాజీనామా డిమాండ్ చేస్తానని తెలిపారు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా రాలెగావ్ సిద్దిలో గల తన ఇంట్లో ఆయన ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా తనతో కలిసి పోరాడిన కేజ్రీవాల్ మీద ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నాడన్న ఆరోపణలు రావడం తనకు ఎంతో బాధ కలిగిస్తోందని అన్నారు. కేజ్రీవాల్ తన మంత్రివర్గంలోని సత్యేంద్ర జైన్ నుంచి రూ. 2 కోట్లు తీసుకుంటుండగా తాను చూశానని కపిల్ మిశ్రా ఆరోపించగా, దాన్ని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా ఖండించిన విషయం తెలిసిందే.