దమ్ముంటే నన్ను పార్టీ నుంచి వెళ్లగొట్టండి!
ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఆయన ఒకప్పటి సన్నిహిత సహచరుడు కపిల్ మిశ్రా సవాలు విసిరారు. దమ్ముంటే తనను పార్టీ నుంచి వెళ్లగొట్టాలని అన్నారు. రాత్రి 7 గంటలకు పీఏసీ సమావేశం పెడుతున్నారని, నలుగురు పెద్దమనుషులు గదిలో నాలుగు గోడల మధ్య కూర్చుని నిర్ణయాలు తీసుకోవడం కాదని, ధైర్యం ఉంటే గత రెండేళ్లుగా మొత్తం మంత్రులందరూ తీసుకున్న నిర్ణయాలు, ఆమోదించిన టెండర్ల ఫైళ్లు తీసుకుని రాంలీలా మైదాన్‌కు రావాలని, అక్కడ ప్రజల ఎదుటే నిపుణులతో వాటిని చెక్ చేయించి అక్రమాలకు పాల్పడిన మంత్రులను తొలగించి, నిజాయితీపరులను కొనసాగించాలని డిమాండ్ చేశారు.
తనకు మంగళవారం ఉదయం 11.30 గంటలకు సీబీఐ వద్ద అపాయింట్‌మెంట్ ఉందని, అక్కడ తాను ఆధారాలన్నీ ఇవ్వడంతో పాటు అధికారికంగా ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తానని చెప్పారు. ఈ కేసులో సాక్షిగా నిలిచి మొత్తం విచారణకు సహకరిస్తానని తెలిపారు. కేజ్రీవాల్ బంధువులలో ఎవరి పేరు మీద భూములు రిజిస్టర్ అయ్యాయో, ఆ పేరు చెప్పాలని సంజయ్ సింగ్ అడిగారని, ఆయనకే కాక మొత్తం దేశానికి చెబుతానని అంటూ.. అరవింద్ కేజ్రీవాల్ బావమరిది కోసమే మంత్రి సత్యేంద్ర జైన్ భూములకు సంబంధించిన డీల్స్ చేశారని ఆరోపించారు.
ప్రశ్నిస్తే బీజేపీ ఏజెంట్లేనా
ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లు బీజేపీ ఏజెంట్లని, మోదీ ఏజెంట్లని ముద్ర వేయడం మామూలు అయిపోయిందని.. కానీ తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీని విడిచిపెట్టి వెళ్లేది లేదని కపిల్ మిశ్రా తెలిపారు. బీజేపీ గురించి ఆప్‌లో ఎవరైనా గట్టిగా మాట్లాడారంటే, పఠాన్‌కోట్ గురించి గానీ, ఇంకా వాళ్ల అవినీతి గురించి ఎవరైనా మాట్లాడారంటే అది కేవలం తాను మాత్రమేనని మిశ్రా చెప్పారు. గత రెండేళ్లలో తన మీద ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని చెప్పారు. బీజేపీలోకి తాను ఎప్పుడూ వెళ్లబోనని, వాళ్ల నాయకులెవరూ తనను సంప్రదించలేదని స్పష్టం చేశారు. తాను బీజేపీ వాళ్లను కలిసినట్లు ఒక్క ఆధారమైనా చూపించాలని సంజయ్ సింగ్, కేజ్రీవాల్ ఇద్దరినీ సవాలు చేశారు.
పంజాబ్‌లో టికెట్ల అమ్మకం
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు టికెట్లు అమ్ముకున్నారని, దాని గురించి, ఇతర అవినితి వ్యవహారాల గురించి తనకు ఇప్పుడు దేశం నలుమూలల నుంచి ఫోన్లు వస్తున్నాయని కపిల్ మిశ్రా అన్నారు. సంజయ్ సింగ్ బంధువులు అమెరికాలో కూడా టికెట్ల కోసం డీల్స్ చేసుకున్నారని.. పోలింగ్‌కు ముందు మద్యం, డబ్బు పంచడమే కాక చివరకు అమ్మాయిలతో కూడా డాన్సులు చేయించారని ఆయన ఆరోపించారు. ఎన్నారైలు ఇచ్చిన విరాళాల గురించి అక్కడ గొడవ జరిగిన విషయాన్ని గుర్తుచేశారు. ఇక ఆప్ నేతలు కొందరు ట్విట్టర్, వాట్సప్‌లలో తన నంబరు అందరికీ పంపుతున్నారని, చాలామంది నుంచి తనను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయని కపిల్ మిశ్రా చెప్పారు. అయితే ఆ బెదిరింపులకు తాను భయపడేది లేదని, కేజ్రీవాల్ తన చెంచాలతో ఏం చేయించుకుంటారో చేయించుకోవాలని సవాలు చేశారు.