నాపై పోటీ చేసి గెలవగలవా: సీఎంకు సవాలు
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మీద సస్పెండైన పార్టీ నేత కపిల్ మిశ్రా సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ నుంచి రూ. 2 కోట్ల లంచం తీసుకున్నారని, అందుకు తానే ప్రత్యక్ష సాక్షినని చెబుతున్న మిశ్రా.. ఢిల్లీలో ఏ నియోజకవర్గం నుంచైనా దమ్ముంటే తన మీద పోటీ చేయాలని కేజ్రీవాల్‌ను సవాలు చేశారు. తనను అసెంబ్లీ నుంచి పంపేయాలని కేజ్రీవాల్ అనుకుంటున్నట్లు తనకు తెలిసిందని, అయినా తనకు లెక్కేమీ లేదని చెప్పారు.
ఆయనకు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా, తనమీద తనకు నమ్మకం ఉన్నా రాజీనామా చేసి అసెంబ్లీ బరిలో తనతో పోటీకి దిగాలని అన్నారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, ఆయన తనకు ఎక్కడ కావాలనుకుంటే అక్కడినుంచి పోటీకి దిగొచ్చని.. ఆయన దగ్గర డబ్బు, అధికారం, పార్టీ జనం ఉన్నారని.. తాను మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగుతానని, ప్రజలను ఎదుర్కొనే ధైర్యం కేజ్రీవాల్‌కు ఉందా అని కపిల్ మిశ్రా ప్రశ్నించారు. సీబీఐ కార్యాలయానికి వెళ్లే ముందు కూడా మిశ్రా కేజ్రీవాల్ ఆశీస్సులు కోరారు. ఇది తన జీవితంలోనే అతిపెద్ద పోరాటమని, అందువల్ల మీపై పోరాటం చేసేందుకు తనకు ఆశీస్సులు ఇవ్వాలని అడిగారు.