నా ప్రాణాలకు ముప్పుంది: కపిల్ మిశ్రా
నా ప్రాణాలకు ముప్పుంది: కపిల్ మిశ్రా
Published Wed, May 10 2017 10:33 AM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
న్యూఢిల్లీ: తన ప్రాణానికి ముప్పు ఉందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై తిరుగుబాటు చేసిన కపిల్ మిశ్రా పేర్కొన్నారు. సీఎం కేజ్రీవాల్‌ను రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంలేదని, కేవలం విదేశీ పర్యటనల ఖర్చు వివరాలు చెబితే చాలన్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, అందులో అంతర్జాతీయ నెంబర్ల నుంచి కాల్స్ వచ్చాయని.. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకంజ వేయనని ఆయన స్పష్టంచేశారు. బెదిరింపు కాల్స్ లాంటి వాటికి భయపడేవాడిని కాదని ఆప్ బహిత్కృత నేత అన్నారు. కేజ్రీవాల్‌కు రాసిన లేఖను చదివి వినిపించారు. 'నేను సత్యాగ్రహం చేపట్టాను. ఇందుకోసం నేను మీ ఇంటి ముందు కూర్చుని ఇబ్బంది పెట్టను, ఎక్కడైనా ఏదో ఒక మూలలో అడ్జస్ట్ అయి పోరాటం చేస్తాను.
నేను చనిపోయే పరిస్థితి వచ్చినా మీరు లెక్కచేయరని నాకు తెలుసు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా డబ్బులు లేవని చెప్పిన కేజ్రీవాల్ తో పాటు ఆప్ నేతలు విదేశీ పర్యటనలకు డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయి. ఆప్ సీనియర్ నేతలు అశిష్ ఖేతన్, సంజయ్ సింగ్, రాఘవ్ చద్ధా, దుర్గేష్ పాఠక్, సత్యేంద్ర జైన్‌ల విదేశీ పర్యటనల ఖర్చు వివరాలను వెల్లడించాలన్నదే నా డిమాండ్' అని లేఖలో ఉన్న విషయాలను చెప్పారు.
కేజ్రీవాల్‌కు సత్యేంద్రజైన్ రూ.2 కోట్ల లంచం ఇచ్చారని సీబీఐకి కపిల్ మిశ్రా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రూ.400 కోట్ల మంచినీటి ట్యాంకర్ల కుంభకోణంలోనూ దర్యాప్తు నివేదికలను కేజ్రీవాల్ తొక్కిపెట్టారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 'మీ అవినీతిపై పోరాటం చేయాలనుకుంటున్నాను.. దయచేసి నన్ను ఆశీర్వదించండి అంటూ' మంగళవారం కేజ్రీవాల్‌ను కోరిన కపిల్ మిశ్రా దీక్ష చేపట్టారు.
Advertisement
Advertisement