అన్నట్టుగానే బాంబు పేల్చిన మిశ్రా
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ డొల్ల కంపెనీలు పెట్టి నల్లధనాన్ని వైట్‌గా మార్చారని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) బహిష్కృత నాయకుడు కపిల్ మిశ్రా ఆరోపించారు. ఎన్నిలక సంఘానికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని తెలిపారు. ఆదివారం తాను బట్టబయలు చేసే రహస్యాలతో ఢిల్లీ వణుకుద్దని శనివారం ప్రకటించిన మిశ్రా ఈరోజు మీడియా ముందుకు వచ్చారు.
ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని, ఢిల్లీ ప్రజలను మోసం చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. మొహల్లా క్లినిక్ కుంభకోణంలోనూ ఆప్ నేతల పాత్ర ఉందన్నారు. ఆప్ నేతల విదేశీ పర్యటనల ఖర్చపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. షెల్ కంపెనీ నుంచి ఆప్ రూ. 2 కోట్ల విరాళం తీసుకుందని వెల్లడించారు. ఇవన్నీ కొంతమందికి తెలిసినా ఆధారాలు లేకపోవడంతో మౌనంగా ఉన్నారని చెప్పారు. తాను చేసిన ప్రతి ఆరోపణకు లిఖిత పూర్వక సాక్ష్యాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
పార్టీ విరాళాలకు సంబంధించి వారు చెబుతున్న లెక్కలకు, ఈసీకి సమర్పించిన వివరాలకు పొంతన లేదన్నారు. నాలుగు కంపెనీల్లో అక్రమాలకు సంబంధించి కేజ్రీవాల్‌కు ఆదాయపన్ను శాఖ నోటీసు పంపిందని తెలిపారు. ఆయనకు అక్రమంగా వందలాది కంపెనీలు ఉన్నాయని, ఈ కంపెనీల బ్యాంకు ఖాతాల్లో కోట్లాది రూపాయలు ఉన్నాయని ఆరోపించారు. ఈ కంపెనీలకు సంబంధించిన అధికారిక పత్రాలు తన దగ్గర ఉన్నాయన్నారు. షెల్ కంపెనీలన్నీ కేజ్రీవాల్ నెలకొల్పినవేనని, యాక్సిస్ బ్యాంకు ద్వారా నల్లధనాన్ని వైట్‌గా మార్చారని తెలిపారు. ప్రెస్‌మీట్‌లో మిశ్రా కుప్పకూలిపోవడంతో వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు.