మసకబారుతున్న కేజ్రీవాల్ ప్రతిష్ట
దేశంలో అవినీతిని అంతమే ప్రథమ లక్ష్యంగా ఆవిర్భవించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పుడు స్వయంగా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోతోంది. అవినీతిపై అవిశ్రాంత పోరాటం చేస్తారని ప్రజలు విశ్వసించిన ఆప్ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రతిష్ట మసకబారిపోతోంది. కేజ్రీవాల్‌లో పోరాటపటిమ తగ్గిపోయిందా? దేశంలోని మకిలి రాజకీయాల బురద ఆయనకు కూడా అంటుకుందా? గిట్టని పార్టీలు పనిగట్టుకొని ఆయనపై బురద చల్లుతున్నాయా?
నీళ్ల కుంభకోణానికి సంబంధించి మంత్రి సత్యేంద్ర జైన్ నుంచి అరవింద్ కేజ్రీవాల్ రూ. 2 కోట్ల ముడుపులు తీసుకోవడాన్ని తాను స్వయంగా చూశానంటూ ఆప్ మంత్రివర్గం నుంచి బహిష్కరణకు గురైన కపిల్ మిశ్రా బహిరంగంగా ఆరోపించడమే కాకుండా మరో మూడు అంశాల్లో సీబీఐకి స్వయంగా ఫిర్యాదు చేశారు కూడా. ప్రతిపక్ష నేతలెవరో ఇలాంటి ఆరోపణలు చేస్తే తేలిగ్గా తీసుకోవచ్చేమో గానీ, మొన్నటి వరకు తన మంత్రివర్గంలోనే పనిచేసిన ఓ వ్యక్తి పార్టీపై, పార్టీ నాయకులపై చేసిన అవినీతి ఆరోపణలను ఎవరైనా అలా తీసుకోడానికి వీల్లేదు. కేజ్రీవాల్ కూడా ప్రజల ముందుకు వచ్చి పూర్తి వివరణ ఇవ్వాలి. అయితే కపిల్ మిశ్రా బీజేపీకి అమ్ముడుపోయి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తేలిగ్గా తీసిపారేయడాన్ని ఎలా తీసుకోవాలి?
అవినీతి ఆరోపణలు మొదటిసారి కాదు
అరవింద్ కేజ్రీవాల్‌పై, ఆయన ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు రావడం ఇది మొదటిసారి కాదు. కేజ్రీవాల్ అత్యంత సమీప బంధువు (బావమరిది.. ఇటీవలే బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించారు) సురేందర్ కుమార్ బన్సల్ పీడబ్ల్యూడీ ప్రాజెక్టుకు సంబంధించి ఫోర్జరీ బిల్లులు పెట్టి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు కూడా బలంగా వినిపించాయి. కేజ్రీవాల్ బంధువు కావడం వల్లనే సురేందర్ అవినీతిని మంత్రి సత్యేంద్ర జైన్ చూసీచూడనట్లు వ్యవహరించారని తెలుస్తోంది. అతి తక్కువ బిడ్డింగ్‌కు ఢిల్లీ పీడబ్ల్యుడీ కాంట్రాక్ట్‌ను పొందిన బన్సాల్, ఢిల్లీలోని సోనాపేట్ పారిశ్రామికవాడలో ఉన్న ‘మహదేవ్ ఇంపెక్స్’ కంపెనీ నుంచి రెండు కోట్ల రూపాయల మెటీరియల్ కొనుగోలు చేసినట్లు దొంగ బిల్లులు పెట్టి ప్రభుత్వం నుంచి డబ్బులు డ్రా చేసుకున్నారు. ఈ విషయంలో అవినీతి ఆరోపణలు రావడంతో మీడియా చేసిన పరిశోధనలో సోనాపేట్ పారిశ్రామికవాడలో మహదేవ్ ఇంపెక్స్ అనే కంపెనీయే లేదని తేలింది. ఈలోగా బన్సాల్ కన్నుమూశారు.
మంత్రులు విదేశాలకు ఎందుకు వెళుతున్నారు?
హవాలా, అక్రమ విదేశీ విరాళాల పనుల మీద ఆప్‌కు చెందిన సీనియర్ నాయకులు ప్రభుత్వ డబ్బులతో తరచు విదేశీ యాత్రలు చేసి వస్తున్నారని, వారి యాత్రలపై కూడా దర్యాప్తు చేయాలని ఆప్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా నిరాహారదీక్ష చేస్తున్న కపిల్ మిశ్రా సీబీఐని డిమాండ్ చేశారు. ఆశిష్ కేతన్, సంజయ్ సింగ్, సత్యేంద్ర జైన్, దుర్గేశ్ పాఠక్, రాఘవ్ చద్దా విదేశీ యాత్రలు చేసినట్లు ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలు కూడా కొత్తవి కావు. కాగ్ ఇదివరకే ఈ విషయమై ఆప్ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. విదేశీ యాత్రల వల్ల ప్రభుత్వానికి ఒనకూడిన మేలేమిటో వివరించాలని కూడా నిలదీసింది. ఇప్పటికీ ఈ అంశంపై ఆప్ నీళ్లు నములుతూనే ఉంది.
కాగ్ నివేదిక ఏమంది..
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా 2015లో న్యూజిలాండ్, బ్రెజిల్ దేశాల్లో, 2016లో బెర్లిన్, లండన్, ఫిన్‌లాండ్, ఆర్జెంటీనా దేశాల్లో పర్యటించారు. ఆయన ఈ రెండేళ్లలో ఆరుసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లడం వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి 30.73 లక్షల రూపాయల ఖర్చు అయింది. గతేడాది సెప్టెంబర్‌లో ఢిల్లీలో డెంగ్యూ వ్యాధి విజృంభించినప్పుడు కూడా ఆయన విదేశీ పర్యటనలో ఉండటం వివాదాస్పదమైంది. ఆయన ఏవో సెమినార్ల పేరిట విదేశీలకు వెళ్లినా.. ఒకరోజు ఉండాల్సిన చోట రెండు, మూడు రోజులు ఉండటం, ఓ దేశంలో సెమినార్‌కు వెళ్లి ఆ పేరుమీద మరికొన్ని దేశాలు తిరిగిరావడాన్ని కాగ్ ప్రశ్నించింది. ఆశిష్ కేతన్ లండన్, మలేసియా దేశాల పర్యటనకు వెళ్లి వచ్చారు. ఎందుకు వెళ్లారన్నది అధికారికంగా చెప్పలేదు. అయినా ఢిల్లీ ప్రభుత్వమే ఆయన ఖర్చులన్నింటినీ భరించింది. అలాగే సత్యేంద్ర జైన్ ఇంగ్లండ్, మలేసియా, స్వీడన్ దేశాలు తిరిగొచ్చారు.
ప్రజల ముందు నిరూపించుకోవాలి
ఓటింగ్ యంత్రాలను మార్పిడి చేయడం ద్వారా ఢిల్లీ మున్సిల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని పదే పదే చెబుతూ వస్తున్న అరవింద్ కేజ్రీవాల్, ఈవీఎంలను ట్యాంపర్ చేయవచ్చనే విషయాన్ని నిరూపించేందుకు ఓ ఇంజనీర్ సహచరుడి ద్వారా ఎంతో కష్టపడ్డారు. కానీ అది డమ్మీ ఈవీఎం అని ఈసీ తేల్చిపారేసింది. ఇప్పుడు తన మీద వచ్చిన అవినీతి ఆరోపణల నిగ్గు తేల్చేందుకు ఆయన అంతకన్నా ఎక్కువ కష్టపడాలి. అలా జరగకపోతే ఆయనపై ప్రజలు పెట్టుకున్న ఆశలు వమ్మవుతాయి.