'ప్లీజ్! మాకు గిఫ్టులు ఇవ్వకండి'
న్యూఢిల్లీ: 'ప్లీజ్! దీపావళి పండుగ సందర్భంగా మాకు బహుమతులు ఇచ్చి ఇబ్బందిపెట్టకండి. గిఫ్టులు, దేవతా విగ్రహాలు ఏవీ మేం తీసుకోం'.. ఇది ఢిల్లీ మంత్రుల విన్నపం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో పండుగపూట తాము ఎలాంటి బహుమతులు తీసుకోబోమని మంత్రులు ప్రకటించారు. ఈ మేరకు చేతిరాతతో ఆ కాగితంపై రాసి.. తమ కార్యాలయాల బయట అతికించారు. ప్రభుత్వ విభాగాలన్నింటిలోనూ అవినీతి తగ్గుముఖం పట్టాలని సీఎం కేజ్రీవాల్ ఇటీవల మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు. అవినీతి, అక్రమాలకు చెక్ పెట్టేలా మంత్రులు సొంతంగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో మంత్రులు దీపావళి పండుగ గిఫ్టులకు దూరమని ప్రకటించారు.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లో అవినీతి తగ్గుముఖం పట్టిందని 45శాతం ఢిల్లీవాసులు అభిప్రాయపడుతున్నట్టు సీఎంఎస్-ఐసీఎస్ సర్వే పేర్కొంది. అయితే, ఇంకా చాలా ప్రభుత్వ విభాగాల్లో లంచగొండితనం యథాతథంగా కొనసాగుతున్నదని వారు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో అవినీతిని అణిచేందుకు సీఎం కేజ్రీవాల్ తాజా చర్యలు తీసుకున్నారు.