
బందీలుక్షేమమే.. త్వరలోనే విముక్తి
ఉగ్రవాదుల చెర నుంచి బయటపడిన కర్ణాటక ప్రొ. లక్ష్మీకాంతం వెల్లడి
తెలుగు ప్రొఫెసర్ల కుటుంబాలను పరామర్శించిన ప్రొఫెసర్
హైదరాబాద్: లిబియా దేశంలో వారం రోజులుగా ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు తిరువీధుల గోపీకృష్ణ, చిలువేరు బల రాం కిషన్ క్షేమంగానే ఉన్నారని, వారిద్దరూ త్వరలోనే విడుదల అవుతారని ఉగ్రవాదుల చెర నుంచి బయటపడిన కర్ణాటకకు చెందిన ప్రొఫెసర్ లక్ష్మీకాంతం చెప్పారు. గోపీకృష్ణ, బలరాం కిషన్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆయన మంగళవారం హైదరాబాద్ వచ్చారు. దౌత్య అధికారులతో కలసి ఢిల్లీ నుండి హైదరాబాద్ చేరుకున్న లక్ష్మీకాంతం ఓల్డ్ అల్వాల్‌లోని బలరాం కిషన్ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా జూలై 29న రెండు కార్లలో బయల్దేరిన తమ బృందాలను ఉగ్రవాదులు అపహరించిన తీరు, ఆ తర్వాత పరిణామాలను వివరించారు. ఉగ్రవాదులు తమను మర్యాదపూర్వకంగా చూసుకున్నారని, వారి అధీనంలో ఉన్న గోపీకృష్ణ, బలరాంకిషన్‌లకు ఎలాంటి ఇబ్బందీ లేదని, త్వరలో వారు క్షేమంగా ఇళ్లకు చేరుకుంటారని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. బందీల విడుదలకు భారత విదేశాంగ శాఖ అధికారులతో పాటు లిబియాలోని విద్యార్థి బృందాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయని లక్ష్మీకాంతం చెప్పారు.
ఇబ్బంది పెట్టొద్దు..
ప్రస్తుతం లిబియాలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, బందీలు విడుదలయ్యేంత వరకూ మీడియా కూడా తమకు సహకరించాలని ప్రొఫెసర్ లక్ష్మీకాంతం విజ్ఞప్తి చేశారు. అంతా మంచే జరుగుతుందని తాము భావిస్తున్నామని, అంతకు మించి ఏమీ మాట్లాడలేమని, మీడియా కూడా సహకరించాలని కోరారు. ఇదిలాఉండగా ఉగ్రవాదుల చెర నుండి విడుదలైన కర్ణాటక ప్రొఫెసర్లు లక్ష్మీకాంతం, విజయ్‌కుమార్ మంగళవారం అరబ్ న్యూస్ చానళ్లతో మాట్లాడుతూ తమను ఉగ్రవాదులు ఏ ఇబ్బంది పెట్టలేదని, మిగిలిన ఇద్దరు బందీలను సహృదయంతో విడిచిపెట్టాలని విజ్ఞప్తి చేశారు.