ప్రత్యేక హైకోర్టుపై తేల్చండి
లోక్‌సభలో ప్రభుత్వాన్నినిలదీసిన టీఆర్‌ఎస్ ఎంపీలు
గతంలో రాష్ట్రాల విభజన జరిగిన వెంటనే కొత్త హైకోర్టులు ఏర్పాటు చేశారు
ప్లకార్డులతో మౌన ప్రదర్శన చేసిన ఎంపీలు
న్యూఢిల్లీ: ప్రత్యేక హైకోర్టు అంశంపై వెంటనే తేల్చాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని లోక్‌సభలో తెలంగాణ ఎంపీలు నిలదీశారు. గతం లో రాష్ట్రాల విభజన జరిగిన వెంటనే హైకోర్టుల విభజన కూడా జరిగిందని... ఇక్కడ మాత్రం జాప్యం చేయడం వెనుక ఏదో దురుద్దేశమున్నట్లు కనిపిస్తోందని మండిపడ్డారు. ఈ అంశంపై చర్చించేందుకు టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి మంగళవారం లోక్‌సభలో వాయిదా తీర్మానానికి నోటీసులివ్వగా.. వాటిని స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. దీంతో టీఆర్‌ఎస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి, బి.వినోద్‌కుమార్, కవిత, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ఎ.ఎస్.ఆర్.నాయక్, బాల్క సుమన్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, నగేశ్, వైఎస్సార్‌సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఇదే సమయంలో అటు ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ ఏపీ ఎంపీలు వెల్‌లో ఆందోళన చేపట్టారు. ఈనేపథ్యంలో 11.30 సమయంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఒక ప్రకటన చేశారు.
న్యాయమంత్రితో మాట్లాడాను..
‘‘ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఈరోజు సభలో ఏ అంశంపై ఆందోళన చేస్తున్నారో.. ఆ విషయంలో ఏపీకి న్యాయం జరుగుతుంది. అన్యాయం జరగనివ్వబోం. అలాగే తెలంగాణ విషయంలోనూ ఇందాకే నేను కేంద్ర న్యాయశాఖ మంత్రితో మాట్లాడాను. ఈ సమస్యకు పరిష్కారం చూపడంలో ఆయన తన పూర్తి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికీ అన్యాయం జరగనివ్వబోం..’’ అని పేర్కొన్నారు. ఈ ప్రకటన అనంతరం కూడా టీఆర్‌ఎస్ ఎంపీలు తిరిగి నిరసన కొనసాగించారు.
జీరోఅవర్‌లో నిలదీసిన జితేందర్‌రెడ్డి
లోక్‌సభలో మధ్యాహ్నం ప్రశ్నోత్తరాలు ముగిసిన తరువాత స్పీకర్ జీరో అవర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్ అవకాశం ఇవ్వడంతో జితేందర్‌రెడ్డి మాట్లాడారు. ‘‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 31 ప్రకారం ఏపీకి, తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఉండాలి. ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడు మూడు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు విభజన జరిగిన రోజునే వేర్వేరు హైకోర్టులు ఏర్పడ్డాయి. కానీ ఇక్కడ ఏదో దురుద్దేశం ఉన్నట్టు కనిపిస్తోంది. గత నాలుగు సెషన్లలో కేంద్రం హామీ ఇచ్చింది, కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. మా సీఎం కేసీఆర్ ప్రధానమంత్రిని కూడా కలిశారు. రాష్ట్రపతిని కూడా కలిశారు. అందరూ హామీ ఇచ్చారు. న్యాయవాదులు కూడా ప్రత్యేక హైకోర్టు కోసం ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు ఉమ్మడి హైకోర్టులో ఉన్న మొత్తం 29 మంది న్యాయమూర్తుల్లో 25 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారే. తెలంగాణ వారు న్యాయం విషయంలో వెనకబడి ఉన్నారు. దీన్ని చాలా సార్లు ప్రస్తావించాం. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుంది. ప్రత్యేక హైకోర్టును వెంటనే ఏర్పాటు చేయాలి..’’ అని జితేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
న్యాయమంత్రితో మాట్లాడతా...
దీనిపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సమాధానమిస్తూ.. ‘‘విభజన అనంతరం ఇరు రాష్ట్రాలకు అనేక సమస్యలు వచ్చాయి. హైకోర్టు ఏర్పాటుపై న్యాయమంత్రితో మాట్లాడతా..’’ అన్నారు. దీనికి టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ అభ్యంతరం చెప్పారు. ‘‘సెక్షన్ 31 ప్రకారం ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు రాష్ట్రపతి నోటిఫికేషన్ అవసరం. ఆ నోటిఫికేషన్ రావాలంటే ముందు కేంద్ర కేబినెట్ ఆమోదించాలి. ఇదొక రాజకీయ నిర్ణయం. మా సీఎం ఏపీ హైకోర్టుకూ హైదరాబాద్‌లో వసతులు ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఇంకా జాప్యమెందుకు?’’ అని ప్రశ్నించారు. కాగా, మధ్యాహ్నం ఒంటి గంటకు సభ వాయిదాపడిన అనంతరం టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు.