ఆ దాడులకు బాధ్యులెవరు: ఒవైసీ
న్యూఢిల్లీ: భారత సైనికులే లక్ష్యంగా వరుసగా ఉగ్రవాద దాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. మొన్నటికి మొన్న పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి, ఉడీ ఉగ్రవాద దాడుల్లో పెద్ద ఎత్తున జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జమ్మూకశ్మీర్‌లోని నగ్రోటా ఉగ్రవాద దాడిలో ఏడుగురు జవాన్లు అమరులయ్యారు.
దేశ రక్షణలో భాగంగా వరుస దాడుల్లో సైనికులు ప్రాణాలు కోల్పోతున్న అంశాన్ని ప్రతిపక్ష సభ్యులు బుధవారం పార్లమెంటులో లేవనెత్తారు. ఈ అంశంపై కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ స్పందిస్తూ నగ్రోటా ఉగ్రవాద దాడిలో మరణించిన జవాన్లకు నివాళులర్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరినా వినిపించుకోలేదని, దీనిపై రక్షణమంత్రి సభలో ప్రకటన చేయలేదని విమర్శించారు. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. నిఘా వైఫల్యం కారణంగా పఠాన్ కోట్, ఉడీ ఉగ్రవాద దాడులు జరిగాయని, తాజాగా నగ్రోటా దాడి జరిగిందని, ఈ దాడులకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు.