హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టగా, కాంగ్రెస్ పార్టీ మాత్రం చతికిలపడింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలక్రిందులు చేస్తూ కాషాయపార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంది. బీజేపీ 48 చోట్ల, కాంగ్రెస్ 37 చోట్ల విజయం సాధించాయి. అటూ జమ్మూకశ్మీర్ ఎన్నికల్లోనూ బీజేపీ బాగానే పుంజుకుంది. అధికారంలోకి రాకలేకపోయినప్పటికీ సీట్లను గణనీయంగా పెంచుకుంది. సొంతంగానే 29 స్థానాల్లో జెండా ఎగురవేసింది. కాగా, హరియాణా ఫలితాలను అంగీకరించబోమని కాంగ్రెస్ చేసిన ప్రకటనపై ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అయ్యారు. ఈవీఎంలపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. జమ్మూకశ్మీర్‌లో ఈవీఎంలతోనే గెలిచారని గుర్తు చేశారు. హరియాణాలో బీజేపీ మళ్లీ గెలవడానికి కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలే కారణమని ఆరోపించారు.
బుధవారం ఆయన ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. "ఈవీఎంలను నిందించడం పరిపాటిగా మారింది. ఈవీఎంలతోనే మీరు ఒకచోట గెలిచారు. మరోచోట ఓటమి ఎదురయ్యేసరికి వాటిని నిందిస్తున్నారు. నా అంచనా ప్రకారం హరియాణాలో బీజేపీ ఓడిపోవాల్సింది. ఆ పార్టీకి వ్యతిరేకంగా చాలా అంశాలున్నాయి. పదేళ్లపాటు హరియాణాలో అధికారంలో ఉన్న బీజేపీపై వ్యతిరేకతను సద్వినియోగం చేసుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైంది. కాంగ్రెస్ అంతర్గత విభేదాలతో బీజేపీ లాభపడింది. ఎన్నికల పోరులో బీజేపీకి కొంచెం ఓపెనింగ్ ఇస్తే చాలు.. దాన్ని సద్వినియోగం చేసుకుంటుంద"ని అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు.
చదవండి: ఏపీలాగే హరియాణా ఫలితాలు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడించే సువర్ణావకాశాన్ని కాంగ్రెస్ జారవిడుచుకుందని దుయ్యబట్టారు. "ద్వేష రాజకీయాలతోనే బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పుకునే వారు. ఈ విషయం తప్పని 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేను చెప్పాను. హరియాణాలో బీజేపీ విజయానికి కారకులు ఎవరు? బీజేపీని ఓడించే అవకాశం ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కానీ సువర్ణ అవకాశాన్ని ఆ పార్టీ జారవిడుచుకుంద"ని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.
ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం: కాంగ్రెస్
షహరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోయింది. హరియాణా ఫలితాలను అంగీకరించబోమని, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. బీజేపీ ఒత్తిడితో ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించింది. అంచనాలకు విరుద్ధంగా హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కాగా, కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment