జమ్మూకశ్మీర్‌లో ఖాతా తెరిచింది
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి రెండు రకాల అనుభవాలు ఎదురయ్యాయి. జమ్మూకశ్మీర్‌లో తొలిసారి ఖాతా తెరవగా, హరియాణాలో మాత్రం చతికిలపడింది. జమ్మూకశ్మీర్‌లో ముస్లిం మెజార్టీ కలిగిన దోడా నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి మెహ్రాజ్ మాలిక్ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి గజయ్‌సింగ్ రాణాపై 4,538 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. జిల్లా అభివృద్ధి మండలి(డీడీసీ) సభ్యుడైన మెహ్రాజ్ మాలిక్‌కు 32,228 ఓట్లు, గజయ్‌సింగ్‌కు 18,690 ఓట్లు లభించాయి. దోడాలో నేషనల్ కాన్ఫరెన్స్, డీపీఏ పీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామమాత్రంగా ఓట్లు సాధించారు.
మెహ్రాజ్ మాలిక్ 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. 2020లో డీడీసీ సభ్యుడిగా గెలిచారు. లెఫ్టినెంట్ గవర్నర్ పాలనపై పదునైన విమర్శలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్శించారు. తన విజయం ప్రజలకే దక్కుతుందని మాలిక్ అన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా3 కోసం తన పోరాటం సాగిస్తానని చెప్పారు. ఆయన ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ నిరాశ చెందకుండా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి గెలుపు సొంతం చేసుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను ‘ఆప్’ 7 స్థానాల్లో పోటీ చేసింది. కేవలం ఒక స్థానాన్ని తన ఖాతాలో వేసుకుంది.
హరియాణాలో 1.79 శాతం ఓట్లే
హరియాణా అసెంబ్లీలో పాగా వేయాలని ఎన్నికల్లో గట్టిగా తలపడిన ఆమ్ ఆద్మీ పార్టీకి నిరాశే మిగింది. ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. ఆ పార్టీకి కేవలం 1.79 శాతం ఓట్లు లభించాయి. వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో హరియాణా ఎన్నికల్లో ఓటమి ఆ పార్టీకి శరాఘాతంగా మారింది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సొంత రాష్ట్రమైన హరియాణాలో ఆప్ 89 స్థానాల్లో పోటీ చేసింది. చివరకు రిక్తహస్తమే ఎదురయ్యింది. 2014లో ఆ పార్టీ ఏర్పాటయ్యింది. హరియాణాలో ఇప్పటిదాకా అసెంబ్లీ ఎన్నికల్లో గానీ, లోక్‌సభ ఎన్నికల్లో గానీ కనీసం ప్రభావం చూపలేకపోయింది. ఏ ఒక్క ఎన్నికల్లోనూ గెలుపు దక్కలేదు. రాష్ట్రంలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 46 సీట్లలో పోటీ చేయగా, ఎక్కడా కూడా ‘నోటా’ కంటే ఎక్కువ ఓట్లు రాలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడం ఆప్‌ను దెబ్బతీసినట్లు పరిశీలకులు చెబుతున్నారు. హరియాణాకు రెండు వైపులా ఉన్న పంజాబ్, ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే.
అతివిశ్వాసం వల్లే ఓటమి: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: హరియాణాలో అతి విశ్వాసం వల్లే ఓడిపోయామని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఆయన మంగళవారం ఢిల్లీలో ఓ సమావేశంలో మాట్లాడారు. అతి విశ్వాసం ఉన్నవారికి హరియాణా ఎన్నికల ఫలితాలు ఒక గుణపాఠం అని పేర్కొన్నారు. ఏ ఒక్క ఎన్నికనూ తేలిగ్గా తీసుకోవద్దని, ప్రతి సీటూ ముఖ్యమేనని, గెలుపు కోసం కష్టపడి పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. హరియాణాలో ఇతర పార్టీలతో తాము పొత్తు పెట్టుకొని ఉంటే భిన్నమైన ఫలితాలు వచ్చేవని రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు సుశీల్ గుప్తా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment