ట్రంప్‌పై కోపం: ఆస్కార్ విజేత బాయ్‌కాట్
ట్రంప్‌పై కోపం: ఆస్కార్ విజేత బాయ్‌కాట్
Published Mon, Feb 27 2017 9:59 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM
తాను తీసిన సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం అంటే జీవితంలో అంతకంటే పెద్ద పండగ ఏమీ ఉండదు. అందులోనూ ఇంగ్లీషు సినిమా కాకుండా, ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో బహుమతి పొందాలంటే దాదాపు ప్రపంచంలోని అన్ని భాషల చిత్రాలతో పోటీ పడాలి. కానీ అలాంటి బహుమతి వచ్చినా కూడా తనకు అక్కర్లేదంటూ ఓ దర్శకుడు ఆస్కార్ అవార్డుల ఫంక్షన్‌ను బహిష్కరించారు. అందుకు కారణం ఎవరో తెలుసా.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. 'ద సేల్స్‌మన్' అనే చిత్రానికి ఆస్కార్ అవార్డు పొందిన ఇరానీ దర్శకుడు అస్ఘర్ ఫర్హాదీ ఈ కార్యక్రమానికి వెళ్లలేదు. ముస్లిం దేశాలపై డోనాల్డ్ ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్‌ను నిరసిస్తూ ఆయన ఈ కార్యక్రమాన్ని బహిష్కరించారు. ట్రంప్ విధానాలతో అగౌరవపడిన ప్రజలకు సంఘీభావంగా తాను ఆస్కార్ ఫంక్షన్‌కు దూరంగా ఉంటున్నట్లు తన పేరుతో పంపిన ప్రకటనతో ఫర్హాదీ పేర్కొన్నారు.
ప్రపంచాన్ని అమెరికా, దాని శత్రువులుగా విభజించడం ద్వారా మిగిలిన దేశాలకు ఒకరకమైన భయం కలిగించారని, ఇది యుద్ధ కాంక్షతో కూడిన దాడిలాంటిదేనని ఆయన అన్నారు. ఫర్హాదీ పంపిన సందేశాన్ని ఇరాన్‌లో పుట్టి, అమెరికాలో ఇంజనీర్, వ్యోమగామి అయిన అనౌషే అన్సారీ ఆస్కార్ వేదికపై చదివి వినిపించారు. ఈ యుద్ధాలు ప్రజాస్వామ్యాన్ని, మానవహక్కులను హరిస్తాయని కూడా ఫర్హాదీ అన్నారు. కాగా, అస్ఘర్ ఫర్హాదీకి విదేశీ చిత్రాల విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఆయన 2011 సంవత్సరంలో 'ఎ సెపరేషన్' అనే సినిమాకు కూడా అవార్డు పొందారు. పెళ్లయిన దంపతులలో భార్య మీద అపార్టుమెంటులో దాడి జరిగిన తర్వాత వాళ్లిద్దరూ ప్రశాంతమైన జీవితం, న్యాయం కోసం చేసే పోరాటమే 'ద సేల్స్‌మన్' చిత్రం ఇతివృత్తం.
Advertisement
Advertisement