స్తంభించిన గ్రామీణ వైద్యం
సాక్షి, హైదరాబాద్: ‘ఆశ’ వ ర్కర్ల సమస్యలను పరిష్కరించడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలమైంది. 24 రోజులుగా వేలాది మంది ఆశ కార్యకర్తలు సమ్మె చేస్తున్నా పట్టించుకోవడంలేదు. వారితో చర్చలు జరిపి సమ్మె విరమింపజేయడంలో సర్కారు పెద్దలు నిర్లక్ష్యం చూపుతున్నారన్న విమర్శలున్నాయి. వ్యాధుల సీజన్‌లో ‘ఆశ’ వర్కర్ల సమ్మె.. పల్లెల్లో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. డెంగీ, మలేరియా, చికున్ గున్యా, విష జ్వరాలతో పల్లెలు విలవిలలాడుతుంటే.. ఈ సమ్మె పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది.
పారితోషికాలు కాకుండా కనీస వేతనం రూ. 15 వేలు ఇవ్వాలని ఆశ వర్కర్లు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. పెన్షన్, గ్రాట్యుటీ, ప్రసూతి సెలవులు, ప్రమాద బీమా సౌకర్యం ఇవ్వాలని కోరుతున్నారు. రెండ్రోజుల క్రితం మంత్రి లక్ష్మారెడ్డితో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెను మరింత ఉధృతం చేసేందుకు ఆశ వర్కర్లు సన్నద్ధమవుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం చేపట్టాలని యోచిస్తున్నారు. ఈ లోపు జిల్లాల్లో నిరవధిక నిరాహార దీక్షలకు రంగం సిద్ధం చేశారు.
సమ్మెలో 25 వేల మంది...
రాష్ట్రంలో 25 వేల మంది ఆశ వర్కర్లు పనిచేస్తున్నారు. పదే ళ్ల క్రితం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) మార్గదర్శకాల ప్రకారం వీరిని నియమించారు. కుటుంబ నియంత్రణ, ఆసుపత్రిలో కాన్పు, ఇమ్యునైజేషన్ వంటి వాటితోపాటు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను జయప్రదం చేస్తున్నారు. అయితే వీరికి ప్రభుత్వం నామమాత్రపు పారితోషికాలను ఇస్తోంది. పనిని బట్టి నెలకు ఒక్కో ఆశ వర్కర్‌కు రూ. 400 నుంచి రూ. 2 వేల వరకు ఇస్తున్నారు.
రోజంతా పల్లెల్లో తిరిగితే వచ్చే ఈ పారితోషికం ఏమాత్రం సరిపోవడంలేదు. కనీస వేతనం రూ. 15 వేలు ఇవ్వాలని అనేకసార్లు ఆందోళనలు నిర్వహించినా స్పందన లేదు. పశ్చిమబెంగాల్, కేరళ, హర్యానా రాష్ట్రాలు పారితోషికాలతోపాటు నిర్ణీత వేతనాలు ఇస్తున్నాయని తెలంగాణ వాలంటరీ, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే వేతనాలు నిర్ణయించాలని ఆమె డిమాండ్ చేశారు. లేకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని.. నిరవధిక దీక్షలు, చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.