పట్టిసీమలో అడ్డులేకుండా..అయినోడికి అందలం!
- ఏపీలోనే కొనసాగనున్న పోలవరం ఎస్‌ఈ రమేష్‌బాబు
- పదవీ విరమణ రోజు హడావుడిగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు
- పోలవరం, పట్టిసీమ అడ్డగోలు బిల్లులు ఆమోదం పొందడానికే..!
- నజరానాగా రెండేళ్ల సర్వీసు
- తెలంగాణ జోన్లలోనే ఎంపికైన 182 మంది ఏపీ ఇంజనీర్లకు అన్యాయం
సాక్షి, హైదరాబాద్: పోలవరానికి ‘చంద్ర గ్రహణం’ పట్టించి ప్రాజెక్టు పనుల్లో కాంట్రాక్టర్‌కు అనుకూలంగా వ్యవహరించడానికి, పట్టిసీమ ఎత్తిపోతల పనుల్లో అవినీతిని పట్టించుకోకుండా అడ్డగోలు బిల్లులకు ఆమోదం తెలపడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యూహరచన చేసింది. ఈ ప్రాజెక్టుల విషయంలో తాము అనుకున్నది అనుకున్నట్టు సులభంగా జరిగిపోయేలా ఎత్తుగడ వేసింది.
వివరాల్లోకి వెళితే.. 182 మంది ఏపీ ఇంజనీర్లను తెలంగాణలోని 5, 6 జోన్లలో ఎంపికయ్యారనే పేరిట ప్రభుత్వం ఆ రాష్ట్రానికి పంపించింది. తెలంగాణ ప్రభుత్వం తమకు పోస్టింగులు ఇవ్వకుండా సతాయిస్తోందని, తమను ఏపీలోనే కొనసాగించాలని, సీనియారిటీ సైతం అడగబోమని వారెంతగా వేడుకున్నా కనికరం లేకుండా వ్యవహరించింది. కానీ ఒకే ఒక్క అధికారికి మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఇచ్చింది.
ఆ ఒక్కరే పోలవరం ఎస్‌ఈ రమేష్‌బాబు. తెలంగాణలోని ఆరో జోన్‌లో ఎంపికైన రమేష్‌బాబును.. ఆ రాష్ట్రానికి పంపించకుండా, ఏపీలోనే కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన తెలంగాణలోనే కనుక కొనసాగితే గురువారమే (ఏప్రిల్ 30న) పదవీ విరమణ చేయాల్సి వచ్చేది. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో ఆయన మరో రెండేళ్ల పాటు సర్వీసులో కొనసాగనున్నారు. ఆయన సేవల్ని వినియోగించుకుంటే.. అసాధ్యమనుకునే అద్భుత నిర్మాణాలను సైతం సాకారం చేయగలరు.. అంతటి నైపుణ్యం ఆయన సొంతం.. అన్న రికార్డేమీ లేదు.
అత్యంత నిజాయితీతో పనిచేశారనే క్లీన్‌చిట్ కూడా లేదు. ఉన్నదల్లా సర్కారు పెద్దలు చెప్పినట్లుగా అడ్డగోలు బిల్లులైనా సరే మారు మాట్లాడకుండా ఆమోదముద్ర వేసే చాతుర్యమే. నాణ్యత ఉన్నా లేకున్నా.. అద్భుతం అంటూ నివేదిక రాయగల నైపుణ్యమే. ఇవీ రమేష్‌బాబు గురించి నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్న మాటలు. ఆ నైపుణ్యమే.. ఆయన్ను తెలంగాణకు పంపించకుండా ఏపీలోనే కొనసాగించడానికి కారణమైంది.
తెలంగాణలోని 5, 6 జోన్లలో ఎంపికై, రాష్ట్రంలో పనిచేస్తున్న 182 మంది ఏపీ ఇంజనీర్లను రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వం తెలంగాణకు పంపించింది. వీరు ఏపీలో కొనసాగేందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అంగీకరించదని నీటిపారుదల శాఖ అధికారులు తేల్చిచెప్పారు. కానీ అదే ఆరో జోన్‌లో ఎంపికైన రమేష్‌బాబును మా త్రం ఏపీలో కొనసాగించడానికి అనుమతించాలని కోరుతూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గత మార్చి 26న తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం ఒక్క రమేష్‌బాబు విషయంలోనే ఎందుకు మినహాయింపు కోరుతోందనే విషయం అర్థంకాని తెలంగాణ అధికారులు ఆ లేఖకు జవాబివ్వకుండా తాత్సారం చేశారు. రమేష్‌బాబుకు ఈ నెల్లో (ఏప్రిల్) 58 సంవత్సరాలు నిండాయి.
ఆయన్ను ఏపీలో కొనసాగించడానికి తెలంగాణ సర్కారు కనుక అనుమతి మంజూరు చేయని పక్షంలో గురువారం పదవీ విరమణ చేయాల్సి వచ్చేది. అయితే ఏపీ అధికారుల ఒత్తిడి నేపథ్యంలో.. రమేష్‌బాబును ఏపీలో కొనసాగించడానికి తమకు అభ్యంతరం లేదంటూ తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి బుధవారం (ఏప్రిల్ 29న) ఏపీ సర్కారుకు లేఖ వచ్చింది. లేఖ అందిన వెంటనే.. గురువారం రమేష్‌బాబును ఏపీలోనే కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో నంబర్ 42) ఇచ్చింది. ఆయన ఒక్కరికి మాత్రమే ఇలా మినహాయింపు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే విషయాన్ని జీవోలో ఎక్కడా ప్రభుత్వం పేర్కొనకపోవడం గమనార్హం.
ఇద్దరు సీఎస్‌లకు అవమానం!
రెండు రాష్ట్రాల మధ్య లావాదేవీలు కేవలం ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ద్వారానే జరగాలి. సమాచారం కూడా సీఎస్‌ల ద్వారానే ఇచ్చిపుచ్చుకోవాలి. కానీ రమేష్‌బాబు విషయంలో అందుకు భిన్నంగా జరిగింది. ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు కనీస సమాచారం లేకుండానే.. నీటిపారుదల శాఖల ముఖ్య కార్యదర్శుల మధ్యే వ్యవహారం సాగింది. ఇది ఇటు ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుకు, అటు తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మకు అవమానమని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.