మళ్లీ గందరగోళం.. సభ మళ్లీ వాయిదా
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా సభ వాయిదా పడి, మళ్లీ మరోసారి సమావేశం అయినప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తింది. దాంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. సభలో గందరగోళం సృష్టించిన డీఎంకే ఎమ్మెల్యేలందరూ సభను ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా స్పీకర్ ధనపాల్ ఆదేశించడంతో వాళ్లంతా ఒక్కసారిగా మళ్లీ పోడియం వద్దకు దూసుకెళ్లారు.
స్పీకర్ స్థానం వద్ద ఎదురుగా వెళ్లి ధర్నా చేశారు. వాళ్లను ఖాళీ చేయించాలని, బయటకు తీసుకెళ్లాలని మార్షల్స్‌ను స్పీకర్ ఆదేశించినా.. వాళ్లు కూడా అసలు సభ్యులను బయటకు తీసుకెళ్లలేకపోయారు. దాంతో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా సభ్యులెవరూ తమ తమ సీట్లలో కూర్చోకపోవడం.. సభలో అదే గందరగోళ పరిస్థితులు ఉండటంతో స్పీకర్ ధనపాల్ సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు.