స్పీకర్ మీదకు కుర్చీల విసిరివేత
తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా తీవ్ర గందరగోళం ఏర్పడింది. అది నిజంగానే ఎవరి 'బలం' ఎంత ఉందో నిరూపించుకునేలా మారింది. రహస్య ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న డీఎంకే ఎమ్మెల్యేలు .. స్పీకర్ ధనపాల్ మీదకు కుర్చీలు విసిరేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఆయన ఎదురుగా ఉన్న కుర్చీని విరగ్గొట్టి, మైక్రోఫోన్లు కూడా విరిచేశారు.
ఆయన టేబుల్ కూడా విరగ్గొట్టినట్లు తెలుస్తోంది. ఆయన మీదకు ముందుగా కాగితాలు విసిరేశారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం రహస్య ఓటింగ్ నిర్వహించడానికి వీల్లేదని స్పీకర్ ధనపాల్ చెప్పడంతో... డీఎంకే ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో స్పీకర్ ధనపాల్ సభను మధ్యాహ్నం ఒంటిగంటకు వాయిదా వేసి సభ నుంచి బయటకు వచ్చేశారు. అంతలో స్పీకర్ తీరుకు నిరసనగా.. డీఎంకే ఎమ్మెల్యే కు కా సెల్వం నేరుగా వెళ్లి స్పీకర్ కుర్చీలో కూర్చున్నారు.