
అక్కడ కూడా స్పీకర్‌పై అవిశ్వాసం
తమిళనాట కూడా ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకే.. అక్కడి అసెంబ్లీ స్పీకర్ ధనపాల్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే అది ఓడిపోయింది. తీర్మానానికి అనుకూలంగా 97 ఓట్లు, వ్యతిరేకంగా 122 ఓట్లు వచ్చాయి. దాంతో పళనిస్వామి ప్రభుత్వం మరోసారి సభలో తన బలాన్ని నిరూపించుకున్నట్లు అయ్యింది. ఫిబ్రవరి 18వ తేదీన నిర్వహించిన విశ్వాస తీర్మానంలో కూడా ప్రభుత్వానికి సరిగ్గా 122 ఓట్లే వచ్చాయి. అయితే అప్పట్లో పళనిస్వామిని తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఆయనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరూ సభలో లేరు. మాజీ డీజీపీ, మైలాపూర్ ఎమ్మెల్యే ఆర్ నటరాజ్ మాత్రం అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు.
ఇక తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించేముందు.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత తనను స్పీకర్‌గా చేశారని, తాను సభను నిర్వహిస్తున్న తీరును ఆమె ఎంతగానో ప్రశంసించారని ధనపాల్ చెప్పారు. తాను రెండు సార్లు చాలా బాధపడ్డానని, ఒకటి జయలలిత సంతాప సందేశం చదివేటప్పుడు, రెండోసారి ఫిబ్రవరి 18న సభలో డీఎంకే సభ్యుల ప్రవర్తన చూసి అని తెలిపారు. ధనపాల్ తన చాంబర్‌లోకి వెళ్లిన తర్వాత డిప్యూటీ స్పీకర్ పొల్లాచి జయరామన్ సభకు అధ్యక్షత వహించి, మూజువాణీ ఓటు, ఆ తర్వాత డివిజన్ నిర్వహించారు. తీర్మానం వీగిపోయిన తర్వాత స్పీకర్ ధనపాల్ మళ్లీ తన స్థానంలోకి వచ్చారు. దాంతో అధికార పార్టీ సభ్యులు బల్లలను చరుస్తూ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. తమకు బలం లేదని తెలిసి కూడా తీర్మానాన్ని ప్రవేశపెట్టామని ప్రతిపక్ష ఉపనేత ఎస్ దురై మురుగన్ చెప్పారు. జయలలిత అప్పుడు పొగడటం మంచిదేనని, అసెంబ్లీ పదవీకాలం మొత్తం ముగిసిన తర్వాత తమ ప్రశంసలు కూడా పొందేలా సభను నిర్వహించాలని సూచించారు.