
సమైక్యాంధ్ర కోసం అసెంబ్లీ తీర్మానం చేయాలి : వీ లక్ష్మణరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ సమితి కో-ఆర్డినేటర్ లక్ష్మణరెడ్డి
పెనుమంట్ర, న్యూస్‌లైన్ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చొరవ తీసుకుని అసెంబ్లీని సమావేశపర్చి సమైక్యాంధ్రపై తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ సమితి కో-ఆర్డినేటర్ వీ లక్ష్మణరెడ్డి డిమాండ్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరులో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన జన గోదావరి సభలో ఆయన పాల్గొన్నారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చించాలని కోరారు.
వైఎస్సార్‌సీపీ సమైక్య శంఖారావాన్ని పూరించడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. కేంద్ర మంత్రులు తక్షణమే పదవులకు రాజీనామా చేసి ఉద్యమానికి నాయకత్వం వహించాలని, రాజకీయ నాయకులు పరస్పర దూషణలు వీడి ఉద్యమంలో మమేకం కావాలని ఆయన కోరారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, లోక్‌సత్తా పార్టీలు సమైక్యవాదానికి మద్దతు పలకాలన్నారు. హైదరాబాద్‌లో సమైక్యవాదులు నిర్వహించే సమావేశాలకు ప్రభుత్వం తగిన భద్రత కల్పించాలన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ఎలాంటి శాస్త్రీయ ప్రాతిపదికను చూపించలేకపోతున్నందున విభజన జరగబోదని లక్ష్మణరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.