అహ్మాదాబాద్: యూఎస్లో గుజరాతీ వ్యాపారవేత్త అమిత్ పటేల్ హత్య కేసులో జోక్యం చేసుకోవాలని ఆ రాష్ట్ర సీఎం ఆనందీబెన్ పటేల్ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ హత్య కేసుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి త్వరతగతిన పూర్తి చేసి.. నిందితులను కఠినంగా శిక్షించేలా యూఎస్ ప్రభుత్వాన్ని కోరాలని ఆమె నరేంద్ర మోదీని కోరారు.ఈ మేరకు ఆనందీబెన్ పటేల్ మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు.గుజరాత్ కైదా జిల్లాలోని ఉత్తరసంద్ గ్రామానికి చెందిన పటేల్ యూఎస్ ఎడిసన్ పట్టణంలోని ఇర్వింగ్టన్లో వైన్ షాపు నిర్వహిస్తున్నాడు.
ఆ క్రమంలో కొందరు దుండగులు సోమవారం అమిత్ పటేల్ షాపులోకి ప్రవేశించి... విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు.దీంతో అమిత్ రక్తపుమడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచారు.ఆ సమాచారాన్ని వారి కుటుంబసభ్యులకు తెలిపారు. దాంతో వారు స్థానిక ఎమ్మెల్యేను కలసి ఈ కేసులో మోదీ జోక్యం చేసుకుని యూఎస్ అధికారులు త్వరితగతిన విచారణ చేపట్టేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సదరు ఎమ్మెల్యే సీఎం ఆనందీబెన్ పటేల్ను కలిసి పరిస్థితిని వివరించారు.దీంతో ఆమెపై విధంగా స్పందించారు.