ఆన్‌లైన్‌లో ఆస్ట్రేలియా వీసా
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యాటక వీసా కోసం భారతీయులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆ దేశ హైకమిషనర్ తెలిపారు. అర్హులైన భారతీయులు తమ విభాగం ‘ఇమ్మి అకౌంట్ పోర్టల్’ ద్వారా జూలై 1 నుంచి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని ఆస్ట్రేలియా తాత్కాలిక హైకమిషనర్ క్రిస్ ఎల్‌స్టోఫ్ట్ పేర్కొన్నారు. దీని ద్వారా ఆస్ట్రేలియాలో పర్యటిం చాలనుకునే భారతీయులకు వీసా దరఖాస్తు ప్రక్రియ మరింత సులభతరం అవుతుందన్నారు.
దరఖాస్తుదారుడి అంగీకారంతో అతడి కుటుంబ సభ్యులు, ట్రావెల్ ఏజెంట్, వీసా అప్లికేషన్, కేంద్రం ఇలా థర్డ్ పార్టీకి చెందిన వారెవరైనా దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేయొచ్చని ఆయన వెల్లడించారు. దరఖాస్తు ఫారాలు, అనుబంధ పత్రాలు ప్రాసెసింగ్ కార్యాలయానికి అందుబాటులో రావడం వల్ల ఇలాంటి వీసాలకు ప్రాసెసింగ్ సమయం చాలా తక్కువ అవుతుందన్నారు. భారత్‌లో ఆస్ట్రేలియా వీసాలకు ఆదరణ పెరుగుతోందని, గతేడాది జూలై నుంచి ఈ ఏడాది మార్చి మధ్యలో సుమారు రెండున్నర లక్షల మంది భారతీయులు ఆస్ట్రేలియాలో పర్యటించారని తెలిపారు.