వాతావరణ కేంద్ర కంప్యూటర్లు హ్యాక్
వాతావరణ కేంద్ర కంప్యూటర్లు హ్యాక్
Published Wed, Oct 12 2016 11:18 AM | Last Updated on Thu, Oct 4 2018 8:24 PM
కాన్ బెర్రా: ఆస్ట్రేలియా జాతీయ వాతావరణ బ్యూరో కంప్యూటర్లను అంతర్జాతీయ హ్యాకర్లు హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియన్ సైబర్ సెక్యూరిటీ సెంటర్(ఏసీఎస్సీ) అధికారికంగా బుధవారం ప్రకటించింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ రహస్య సమాచారాన్ని హ్యాకర్లు తస్కరించారు. గత ఏడాది కూడా వాతావరణ కేంద్ర కంప్యూటర్లు హ్యాక్ కు గురైన విషయం తెలిసిందే.
అయితే, హ్యాకింగ్ కు గల కారణాలు తెలియరాలేదు. కేవలం నష్టం కలిగించడానికి మాత్రమే హ్యాకర్లు ఈ పని చేసుంటారని నిపుణులు అంటున్నారు. ఏసీఎస్సీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వాతావరణ కేంద్రంలో గల రెండు కంప్యూటర్లలోకి వైరస్ చొరబడినట్లు గుర్తించామని చెప్పారు. పరిశీలించి చూడగా అంతర్జాతీయ హ్యాకర్లు ఉపయోగించే రిమోట్ యాక్సెస్ టూల్(ఆర్ఏటీ)గా తేలిందని వెల్లడించారు.
ఈ టూల్ ను ఉపయోగించే గతంలో కొన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వ కంపూటర్లను హ్యాక్ చేసేందుకు హ్యాకర్లు యత్నించారని తెలిపారు. గత ఏడాదిన్నర కాలంలో 1,095సార్లు ప్రభుత్వ కంప్యూటర్లపై హ్యాకర్లు దాడులు చేశారని పేర్కొన్నారు. కాగా, గతంలో ఆస్ట్రేలియా అధికారులు హ్యాకింగ్ పై చైనాను దూషించిన విషయం తెలిసిందే.
Advertisement