టాప్-20 కుబేరుల్లో ప్రేమ్జీ, శివనాడార్
న్యూయార్క్: ప్రపంచ ఐటీ రంగంలో టాప్-20 ధనవంతుల జాబితాలో విప్రో చైర్మన్ అజీం ప్రేమ్జీ, హెచ్సీఎల్ అధినేత శివనాడార్కు స్థానం దక్కింది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అగ్రస్థానంలో ఉన్నారు.
ఫోర్బ్స్ విడుదల చేసిన తాజా జాబితాలో ప్రేమ్జీ, నాడార్ వరసగా 13, 14వ స్థానాల్లో ఉన్నారు. ప్రేమ్జీకి లక్షా 13 వేల కోట్లు, నాడార్కు 93 వేల కోట్ల రూపాయల సంపద ఉన్నట్టు ఫోర్బ్స్ వెల్లడించింది. టాప్-100 జాబితాలో మరో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు రమేష్ వద్వాని, భరత్ దేశాయ్ ఉన్నారు. సింఫోని టెక్నాలజీ గ్రూపు చైర్మన్ రమేష్ వద్వాని 73వ స్థానంలో ఉన్నారు. ఆయన సందప దాదాపు 18 వేల కోట్ల రూపాయలు. 82వ స్థానంలో ఉన్న భరత్ దేశాయ్కు 16 వేల కోట్ల రూపాయలకుపైగా ఆస్తులున్నాయి.
ప్రపంచ అపర కుబేరుడు బిల్గేట్స్ సంపద 5.16 లక్షల కోట్ల రూపాయలు. ఒరాకిల్ వ్యవస్థాపకుడు ఎలిసన్కు 3.24 లక్షల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. కుబేరుల జాబితాలో అమెరికన్లదే అగ్రస్థానం. టాప్-100లో 51 మంది అమెరికన్లే ఉన్నారు. ఆ తర్వాతి స్థానం ఆసియాది. ఆసియా దేశాలకు చెందిన 33 మంది ధనవంతుల జాబితాలో ఉన్నారు. ఇక ఐటీ కుబేరుల జాబితాలో యూరప్ వెనుకబడివుంది. యూరప్కు చెందిన 8 మందికి మాత్రమే జాబితాలో చోటు దక్కింది.