ముఖేష్ అంబానీ (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మరోసారి బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్‌లో తన సత్తా చాటారు. బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ టాప్ 100 ఇండెక్స్‌లో అంబానీ 19వ స్థానంలో నిలిచారు. అంతేకాక ఆసియాలోనే మూడో అత్యంత ధనిక వ్యక్తిగా పేరొందారు. 38.3 బిలియన్ డాలర్లు(రూ.2,49,160 కోట్లకు పైగా) సంపదతో ముఖేష్ అంబానీ ఈ స్థానంలో నిలిచారని బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ పేర్కొంది. అంబానీతో పాటు మరో నలుగురు భారతీయులు కూడా బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్‌లో చోటు దక్కించుకున్నారు. వారిలో ఆర్సెలర్‌మిట్టల్ సీఈవో లక్ష్మి మిట్టల్, షాపూర్జీ పల్లోంజి గ్రూప్ చైర్మన్ పల్లోంజి మిస్త్రీ, విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్ చైర్మన్ శివ్ నాడార్‌లు ఉన్నారు.
బ్లూమ్‌బర్గ్ బిలీనియర్స్ టాప్ 500 ఇండెక్స్‌లో మొత్తంగా 24 మంది భారతీయులు ఉన్నట్టు తెలిసింది. గతేడాదితో పోలిస్తే అంబానీ సంపద 9.3 బిలియన్ డాలర్లు పెరిగింది. కాగ, ఈ ఇండెక్స్‌లో ప్రథమ స్థానంలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఉన్నారు. ఆయన తర్వాతి స్థానంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఉన్నట్టు తెలిసింది. అమెరికన్లను మినహాయిస్తే, కేవలం ఇద్దరు యూరోపియన్లు మాత్రమే ఈ ఇండెక్స్‌లో చోటు దక్కించుకున్నారు. వారిలో ఒకరు జరా వ్యవస్థాపకుడు అమెంషియో ఓర్టెగా, రెండో వ్యక్తి లగ్జరీ బ్రాండు ఎల్‌వీఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్. ఆసియా నుంచి అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మా, టెన్సెంట్ కో-ఫౌండర్, సీఈవో పోనీ మా లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment