
హైదరాబాద్: గడిచిన కొంత కాలంగా కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ గురువు గోపీచంద్ వద్దకే తిరిగి రానున్నట్లు, ఇందుకు ఆయన కూడా సమ్మతించినట్లు సైనా సోమవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
మూడేళ్ల కిందట.. మనస్పర్థల కారణంగా గోపీచంద్ అకాడమీని వీడిన సైనా.. బెంగళూరుకు చెందిన విమల్ వద్ద శిక్షణ తీసుకున్నారు. అయితే ఈ మూడేళ్ల కాలంలో ఆమె ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయారు. దీంతో తిరిగి గోపీ వద్దకే రావలనే నిర్ణయం తీసుకున్నారు.
‘‘గోపీచంద్ అకాడమీలో తిరిగి చేరాలని కొంతకాలంగా అనుకుంటున్నాను. ఇదే విషయాన్ని గోపీ సార్‌తో చెబితే, ఆయన మనస్ఫూర్తిగా స్వాగతం పలికారు. ప్రస్తుత తరుణంలో ఆయన శిక్షణ నా లక్ష్యాలకు నన్ను దగ్గర చేస్తుందనే నమ్మకం ఉంది’’ అని సైనా తెలిపారు.
గడిచిన మూడేళ్లలో విమల్‌సార్ శిక్షణలోనూ తాను రాణించానని, వరల్డ్ నంబర్1 ర్యాంకును కైవసం చేసుకోవడమే కాక రెండు వరల్డ్ చాంపియన్‌షిప్ పతకాలు, పలు సూపర్‌సిరీస్ టైటిల్స్ గెలుచుకున్నానని సైనా నెహ్వాల్ గుర్తుచేశారు.