‘అమరీందర్ ను బతిమాలుకున్న బాదల్’
న్యూఢిల్లీ: పంజాబ్ ప్రజలకు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ వెన్నుపోటు పొడిచారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. సొంత నియోజకవర్గం పాటియాలాను వదిలిపెట్టి లాంబీ పోటీ చేయాలని ఆయన తీసుకున్న నిర్ణయం అధికార అకాలీదళ్ కు లాభిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, అమరీందర్ మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆయన ఆరోపించారు. అందుకే అమరీందర్ నియోజకవర్గం మారారని అన్నారు. ఈ నిర్ణయం బాదల్ కు మేలు చేస్తుందని, అకాలీదళ్ వ్యతిరేక ఓట్లు చీలిపోతాయని వివరించారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ ను లాంబీ నియోజకవర్గంలో పోటీకి దించింది.
అమరీందర్ రెండు స్థానాల్లో ఎందుకు పోటీ చేస్తున్నారని, ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో చేయనివిధంగా బాదల్ ను నేరుగా ఎందుకు సవాల్ చేస్తున్నారని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ‘ఎన్నికల ప్రచారంలో జర్నైల్ సింగ్ దూసుకుపోతుండడంతో బాదల్ కు దడ పట్టుకుంది. దీంతో లాంబీ నుంచి పోటీ చేయాలని అమరీందర్ ను బాదల్ బతిమాలుకున్నారు. అకాలీదళ్ వ్యతిరేక ఓట్లు చీలి తనకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఇలా చేశార’ని కేజ్రీవాల్ ఆరోపించారు. బాదల్-అమరీందర్ పోటీని ‘ఫ్రెండ్లీ మ్యాచ్’గా వర్ణించారు. ఎవరెన్ని చేసినా తమ పార్టీ అభ్యర్థే గెలుస్తారని కేజ్రీవాల్ విశ్వాసం వ్యక్తం చేశారు.