మసకబారుతున్న ఒబామా క్రేజ్!
వాషింగ్టన్: మాటలను కోటలుగా చూపుతూ ప్రజాదరణను మూటగట్టుకున్న అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా క్రేజ్ తగ్గిపోతుందా? తాజా పరిణామాలను చూస్తే అవుననక తప్పదు. ఒబామాకున్న ప్రజాదరణ ఎన్నడూ లేనంతగా మసకబారుతున్నట్లు తాజా సర్వేలో స్పష్టమైంది. అమెరికన్ ప్రజల్లో ఒబామా పట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు ఆ సర్వే పేర్కొంది. తన కంటే ముందు అమెరికా అధ్యక్షునిగా పనిచేసిన జార్జ్ డబ్ల్యూ బుష్ అప్రతిష్టను ప్రస్తుతం ఒబామా మూటగట్టుకున్నారు. 51 శాతం మంది అమెరికన్లు ఒబామాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సీఎన్‌ఎన్-వోఆర్‌సీ నిర్వహించిన అంతర్జాతీయ ఒపీనియన్ పోల్ సర్వేలో వెల్లడైంది.
అప్పటి బుష్ పట్ల 51 శాతం మంది అమెరికన్లు వ్యతిరేకత కనబరచగా.. ఇప్పుడు ఒబామాపై వ్యతిరేకత చూపే వారి సంఖ్య కూడా అంతే ఉన్నట్లు అని సీఎన్‌ఎన్ పోలింగ్ డైరెక్టర్ కీటింగ్ హోలాండ్ చెప్పారు. ప్రస్తుతం ఒబామాకు అనుకూల రేటింగ్ 47 శాతంగా ఉంది. కాగా, ఒబామా, బుష్ కంటే బిల్ క్లింటన్ ప్రజాదరణలో ఇప్పటికీ ముందున్నారు. బిల్ క్లింటన్‌కు 68 శాతం అనుకూల రేటింగ్ దక్కింది. ఈ సర్వేలో ఒబామాకు రేటింగ్ తగ్గడం ఇదే తొలిసారి.