బేణీ.. ములాయం.. భాయీ భాయీ!!
కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ వర్మను ఎప్పుడు ఎవరు కదిలించినా ముందుగా ఆయన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్పై మండిపడుతుంటారు. వాళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ, సోమవారం ఓ విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. పార్లమెంటులో ములాయం ఎదురైనప్పుడు బేణీ ప్రసాద్ వర్మ ఆయనను పలకరించారు.
సభ ప్రారంభం కావడానికి ముందే ఈ చిత్రం కనిపించింది. తన పార్టీ సభ్యులు చుట్టూ ఉన్న కూడా, ములాయం కూడా తన పాత మిత్రుడు బేణీకి ప్రతి నమస్కారం చేశారు. అంతే కాదు.. చెయ్యి పట్టుకుని ఆపేందుకు కూడా ప్రయత్నించారు. కానీ బేణీ మాత్రం నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో ములాయం సింగ్ యాదవ్ తన పక్కన ఉన్నవారితో 'దేఖో భాగ్ గయా (చూడండి, పారిపోయాడు)' అంటూ చమత్కరించారు. ములాయంతో పాటు ఆయన కుమారుడు, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్పై కూడా బేణీ ప్రసాద్ వర్మ తరచు విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు సోషలిస్టులుగా, సన్నిహిత మిత్రులుగా ఉన్న బేణీ, ములాయం కలిసే సమాజ్వాదీ పార్టీని 20 ఏళ్ల క్రితం స్థాపించారు. పార్టీలోకి అమర్సింగ్ ప్రవేశం తర్వాత నుంచి అక్కడ బేణీ ప్రభ తగ్గిపోయింది. చివరకు 2009లో బేణీ కాంగ్రెస్లోకి వెళ్లిపోయి లోక్సభకు ఎన్నికై కేంద్ర మంత్రివర్గంలో చేరారు.