
భవాని.. మరో ‘ప్రత్యూష’
వేధింపులకు గురిచేస్తున్న అన్నావదినలు
బాలల హక్కుల సంఘం చొరవతో విముక్తి
హైదరాబాద్: సవతితల్లి చేతిలో తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూష ఘటనను ఇంకా మరవక ముందే హైదరాబాద్ నేరేడ్‌మెట్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే ఆలస్యంగా వెలుగు చూసింది. అన్న, వదినల దాష్టీకానికి చిత్రహింసలకు గురైన యువతికి చివరకు బాలల హక్కుల సంఘం చొరవ తీసుకోవడంతో విముక్తి లభించింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఉప్పులూరి ఏసు, తిరుపతమ్మ దంపతుల ఏకైక సంతానం భవాని (18). తల్లిదండ్రులిద్దరూ ఎనిమిదేళ్ల కిందట చనిపోయారు. దీంతో ఎవరూ పోషించలేని స్థితిలో యువతి మహబూబ్‌నగర్‌లోనే ఓ హాస్టల్‌లో చేరింది. కాగా, సైనిక్‌పురిలోని టెలికం కాలనీలో నివాసముంటున్న భవాని పెద్దనాన్న కుమారుడు (వరసకు అన్న) శ్రీనివాస్, వదిన లక్షీ్ష్మలు తాము పోషించుకుంటామని చెప్పి యువతిని హాస్టల్ నుంచి తీసుకొచ్చారు.
ఇంటికి రాగానే భవానికి ఇంటిపని అప్పజెప్పారు. సమయానికి కడుపునిండా భోజనం పెట్టకుండా చిత్రహింసలకు గురిచేసేవారు. కాల్చిన గరిటెతో ఒంటిపై వాతలు కూడా పెట్టేవారు. కొన్నాళ్లుగా భవాని అనుభవిస్తున్న బాధలు చూడలేక స్థానికులు కొందరు బాలల హక్కుల సంఘానికి సమాచారం అందజేశారు. వెంటనే స్పందించిన బాలల హక్కుల సంఘం ప్రతినిధులు అచ్యుతరావు, అనురాధారావు పోలీసుల సహాయంతో భవానికి ఆ ఇంటి నుంచి విముక్తి కల్పించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న అన్న, వదినలపై పోలీసులు కేసు నమోదు చేశారు. చికిత్స కోసం యువతను స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రికి తరలించారు. కోలుకున్న తర్వాత ఆమెను విద్యానగర్‌లోని దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్టల్‌కు తీసుకెళ్లనున్నట్లు అచ్యుతరావు తెలిపారు.