న్యాయం లేని విభజన: శరద్ యాదవ్ | Bifurcation hasn't done justice to both regions, says sharad yadav | Sakshi
Sakshi News home page

న్యాయం లేని విభజన: శరద్ యాదవ్

Published Wed, Aug 28 2013 1:59 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

న్యాయం లేని విభజన: శరద్ యాదవ్ - Sakshi

న్యాయం లేని విభజన: శరద్ యాదవ్

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనపై నిర్ణయం చేసినా, ఇరు ప్రాంతాలకు మాత్రం న్యాయం చేయలేకపోయిందని జేడీ(యూ) అధినేత శరద్‌యాదవ్ అభిప్రాయపడ్డారు. ఇరు ప్రాంతాలకు సమాన న్యాయం జరగాలని తాము బలంగా కోరుకుంటున్నామన్నారు. విభజనతో అనేక సమస్యలు ముడిపడి ఉన్నాయని, వాటిని పరిష్కారించాల్సిన అవసరం ఉందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం శరద్‌యాదవ్‌తో ఆయన నివాసంలో 20 నిమిషాల పాటు భేటీ అయింది. విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో కొనసాగుతున్న ఆందోళనను ఆయన దృష్టికి తెచ్చింది. ముఖ్యంగా నదీ జలాలు, విద్యుత్ పంపిణీ, హైదరాబాద్, ఉద్యోగులు, విద్యార్థుల భద్రత వంటి అంశాలకు ఎలాంటి పరిష్కారమూ చూపలేదని వివరించింది. సీమాంధ్రలో సాగుతున్న ఆందోళనలను విజయమ్మ తమ దృష్టికి తెచ్చారని అనంతరం శరద్‌యాదవ్ విలేకరులకు చెప్పారు. ఈ అంశం తప్ప మరేమీ చర్చకు రాలేదన్నారు. మీరు గతంలో తెలంగాణకు మద్దతిచ్చారు, ఇప్పుడు మీ వైఖరెలా ఉంది అని అడగ్గా, ‘విభజిస్తూ కాంగ్రెస్ నిర్ణయం చేసింది. అయితే అక్కడ అనేక సమస్యలున్నాయి. వాటన్నింటిపై చర్చించాల్సిన అవసరముంది’ అని బదులిచ్చారు. విభజనతో అభివృద్ధి సాధ్యమని భావిస్తున్నారా అని అడగ్గా, దానిపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయచేయబోనన్నారు. భావి పొత్తుల అంశమేదీ రాలేదని మరో ప్రశ్నకు బదులుగా చెప్పారు. మర్యాదపూర్వకంగానే శరద్‌యాదవ్‌ను కలిశామని, సీమాంధ్రలోని పరిస్థితులను వివరించామని విజయమ్మ చెప్పారు.
 రాజీనామాలకు కట్టుబడాలి: మేకపాటి
 విభజన ప్రకటన అనంతరం సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలను శరద్‌యాదవ్‌కు వివరించినట్టు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రపతితో, ప్రధానితో విజయమ్మ బృందం సమావేశంపై టీడీపీ నేతల ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. కేవలం విభజన విషయమై చర్చించేందుకే అందరినీ కలిశామని చెప్పారు. రాజీనామాలపై తామంతా చిత్తశుద్ధితో ఉన్నామన్నారు. ‘సమైక్యాంధ్ర కోసం అందరం రాజీనామాలు చేశాం. సమైక్యాంధ్ర ప్రకటన వస్తే ఉపసంహరించుకుందాం. లేదంటే వాటికి అంతా కట్టుబడి ఉండాలి’ అని సూచించారు.
 నేడు జంతర్‌మంతర్ వద్ద విజయమ్మ ధర్నా
 రాష్ట్ర విభజన విషయంలో సమన్యాయం కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యులు ధర్నాలో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు ధర్నా ప్రారంభమవుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement