
అతి భారీ గోల్డ్ స్మగ్లింగ్ గుట్టు రట్టు!
న్యూఢిల్లీ: దేశ చరిత్రలోనే అతిపెద్దదిగా భావిస్తోన్న బంగారం అక్రమరవాణా గుట్టు రట్టయింది. ఒకటికాదు రెండు కాదు రూ.2000 కోట్ల విలువ చేసే 7000 కేజీల బంగారాన్ని భూతల, ఆకాశమార్గంలో తరలించిన వైనాన్ని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు సోమవారం మీడియాకు వెల్లడించారు.
ఆగ్నేయాసియా దేశం మయన్మార్ నుంచి భూతల మార్గం ద్వారా పెద్ద ఎత్తున బంగారాన్ని భారత్ లోకి అక్రమంగా రవాణా చేసే స్మగ్లర్లు.. గువాహటి ఎయిర్ పోర్టు నుంచి డొమెస్టిక్ కార్గో విమానాల ద్వారా రాజధాని ఢిల్లీ సహా ఇతర ప్రాంతాలకు బంగారాన్ని తరలించేవారని డీఆర్ఐ అధికారులు చెప్పారు. ఆ విధంగా ఇప్పటివరకు 617 దఫాలుగా 7 వేల కేజీల బంగారాన్ని భారత్ లోకి స్మగ్లింగ్ చేశారని, దాని విలువ రూ.2వేల కోట్ల వరకు ఉంటుందని వివరించారు. ఇప్పటివరకు ఛేధించినవాటిల్లో అతి భారీ దందా ఇదేనని తెలిపారు.
గుట్టురట్టైందిలా..
కొద్ది రోజుల కిందట ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు డొమెస్టిక్ టెర్మినల్ లో తనిఖీలు నిర్వహించిన అధికారులు గొంకను కదల్చగా ఈ భారీ స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గువాహటి నుంచి ఢిల్లీకి వచ్చిన కార్గో విమానంలో 'విలువైన సరుకు'లను తనిఖీ చేసిన అధికారులు రూ.3.1 కోట్ల విలువచేసే10 కేజీల బంగారాన్ని కనుగొన్నారు. 24 కేరెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని ఇతర సరుకులు అక్రమంగా రవాణాచేశారు. కాగా, కార్గో రిజిస్ట్రేషన్ చిరునామాల ఆధారంగా గువాహటికి చెందిన ఓ వ్యారవేత్తను, ఢిల్లీలోని అతని అనుచరుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అక్రమ రవాణా వ్యవహారానికి సంబంధించి విస్తుపోయే విషయాలు బయటికొచ్చాయి.
విమాన సిబ్బంది హస్తం?
ఇంత భారీ స్థాయిలో గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతున్నా విమానాశ్రయ, విమాన సిబ్బందికి ఇంతైనా అనుమానం రాకపోవడం ఆశ్చర్యంగా ఉన్నదని, ఈ వ్యవహారంలో సిబ్బంది ప్రమేయం కూడా ఉందని అనుమానిస్తున్నట్లు, ఆ మేరకు వారిని త్వరలోనే ప్రశ్నిస్తామని డీఆర్ఐ అధికారులు చెప్పారు.