న్యూఢిల్లీ : బిహార్ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో 58 శాతం మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. మొత్తం 243 మంది ఎమ్మెల్యేల్లో 142 మంది ఈ కేసుల్లో ఉన్నారని మీడియా మంగళవారం వెల్లడించింది. అయితే క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారిలో అత్యధికంగా లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆర్జేడీ పార్టీకి వారే ఉన్నారని పేర్కొంది. ఆ పార్టీకి చెందిన మొత్తం 80 మంది ఎమ్మెల్యేల్లో 46 మందిపై వివిధ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో ఓ ఎమ్మెల్యే మాత్రం తాను నిరక్షరాస్యుడిని అని ప్రకటించాడు.
మరో 93 మంది మాత్రం ఐదవ తరగతి నుంచి 12 తరగతి వరకు చదువుకున్నారు. 137 మంది మాత్రం డిగ్రీ ఆపై ఉన్నత విద్యను అభ్యసించారు. 80 మంది మాత్రం మళ్లీ అసెంబ్లీకి తిరిగి ఎన్నికయ్యారు. జనతాదళ్ (యూ) పార్టీ టికెట్పై ఖగారియా అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగిన పూనమ్ దేవి యాదవ్ మాత్రం రూ. 41 కోట్లకు పైగా ఆస్తులతో అత్యధిక సంపన్నురాలిగా నిలిచింది.
243 స్థానాలు గల బిహార్ అసంబ్లీకి ఇటీవలే ఐదు దశలలో పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో మహాకూటమి ఆర్జేడీ, జనతాదళ్ యూ, కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. బీజేపీ మాత్రం రెండు అంకెలకే పరిమితమైంది. నితీశ్ శుక్రవారం పాట్నాలో బీహార్ ముఖ్యమంత్రిగా ముచ్చటగా మూడో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.