ఇవిగో సవరణలు | BJP Amendments to andhra pradesh reorganisation bill 2013 | Sakshi
Sakshi News home page

ఇవిగో సవరణలు

Published Fri, Feb 7 2014 1:31 AM | Last Updated on Fri, Sep 7 2018 2:20 PM

BJP Amendments to andhra pradesh reorganisation bill 2013

* జైరాం రమేశ్‌కు సమర్పించిన బీజేపీ
* సవరణలకే తొలి ప్రాధాన్యం: రాజ్‌నాథ్
 
సాక్షి, న్యూఢిల్లీ: సీమాంధ్రకు న్యాయం జరిగేందుకు తెలంగాణ బిల్లులో చేయాల్సిన సవరణలను ప్రతిపాదిస్తూ జైరాంకు బీజేపీ సీమాంధ్ర నేతలు లేఖ అందజేశారు. జైరాం గురువారం రాత్రి బీజేపీ అగ్ర నేత వెంకయ్య నాయుడు నివాసానికి వచ్చి వారితో గంట సేపు భేటీ అయ్యారు. భేటీ అనంతరం సీమాంధ్ర బీజేపీ నేత హరిబాబు మీడియాతో మాట్లాడారు. బిల్లు విషయమై కేంద్రం తమతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. తమ సవరణలపై కేంద్రం స్పందనను చూశాక పార్టీలో చర్చించి (బిల్లుకు మద్దతుపై) నిర్ణయం తీసుకుంటామన్నారు. ‘‘హైదరాబాద్‌ను యూటీ చేస్తే ఒప్పుకోబోం. హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణకే బీజేపీ కట్టుబడి ఉంది’’ అన్నారు.

హరిబాబుతో పాటు కృష్ణంరాజు తదితర బీజేపీ సీమాంధ్ర నేతలు పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమయ్యారు. సీమాంధ్రుల డిమాండ్లను సవరణల రూపంలో బిల్లులో పెట్టాలని విన్నవించారు. సీమాంధ్రలో రాజధాని ఎక్కడ పెట్టాలనే విషయాన్ని కూడా బిల్లులో స్పష్టంగా పొందుపరిచేలా చూడాలన్నారు. సీమాంధ్ర ప్రయోజనాల దృష్ట్యా బిల్లులో సవరణలకు తొలి ప్రాధాన్యమిస్తామని రాజ్‌నాథ్ హామీ ఇచ్చినట్టు వారు మీడియాకు తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేశారన్నారు. మరోవైపు మాజీ మంత్రి కోటగిరి విధ్యాధరరావు తనయుడు కోటగిరి శ్రీధర్, టీడీపీ నేత ఎన్.టి.చౌదరి గురువారం రాజ్‌నాథ్ సమక్షంలో బీజేపీలో చేరారు.

 బీజేపీ ప్రతిపాదించిన సవరణలివే...
 1.    భద్రాచలం రెవెన్యూ డివిజన్‌తో పాటు 134 పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలపాలి
 2.    గోదావరి నుంచి 165 టీఎంసీల నీటిని దుమ్ముగూడెం, నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్‌లకు మళ్లించాలి
 3.    పదేళ్ల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేస్తూ రాజ్యంగ సవరణ చేసి, అక్కడి సీమాంధ్రులకు భద్రత భరోసా కల్పించాలి
 4.    బదిలీలపై ప్రభుత్వోద్యోగులకు అప్షన్లు ఇవ్వాలి
 5.    రాయలసీమకు 10 ఏళ్ల పాటు టాక్స్ హాలిడే ప్రకటించాలి

 6.    కృష్ణా మిగులు జలాల నుంచి, పోలవరం నుంచి సీమకు అదనంగా మరో 200 టీఎంసీల నీరివ్వాలి
 7.    ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పూర్తి వివరాలనూ బిల్లులో పొందుపరచాలి
 8.    హైదరాబాద్ ఆదాయంలో సీమాంధ్రకు వాటా. ఈ అంశాన్ని ముసాయిదా బిల్లులోనే చేర్చాలి
 9.    రాయలసీమలో స్టీల్ ప్లాంటు నిర్మించాలి
 10.    సీమాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ  ఇవ్వాలి

 11.    సీమాంధ్రలో ఐఐటీ, కేంద్ర విశ్వవిద్యాలయాలు, ఐఐఎం, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఎన్‌ఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో పాటు పలు నిర్మాణ కంపెనీలను ఏర్పాటు చేయాలి
 12.    విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను విస్తరించాలి
 13. వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను, సీమాంధ్రకు కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement