రజనీ కోసం..!
* రంగంలోకి దిగిన చో
* మోడీ పక్కన కూచోబెట్టే యత్నం
* సూపర్ స్టార్ పెదవి విప్పేనా?
చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో ప్రఖ్యాత నటుడు సూపర్‌స్టార్ రజనీ కాంత్ వాయిస్‌ను దక్కించుకునేందుకు కమలనాథులు కుస్తీలు పడుతున్నారు. మోడీ, రజనీ కాంత్‌ల భేటీకి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రజనీతో సన్నిహితంగా ఉండే, బీజేపీ వాది, తుగ్లక్ పత్రిక సంపాదకుడు చో రామస్వామిని రంగంలోకి దించారు. దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఉన్న అశేష అభిమాన లోకం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ కథానాయకుడిని రాజకీయ అరంగేట్రం చేయించేందుకు అభిమానులు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు.
ఓ దశలో ఏకంగా రజనీకాంత్ పేరిట పార్టీని, జెండాను ప్రకటించి సంచలనానికి తెరదీశారు. అభిమానుల అత్యుత్సాహానికి ఉలిక్కిపడ్డ సూపర్ స్టార్ 'దేవుడు ఆదేశిస్తే...రాజకీయాల్లోకి వస్తాను' అంటూ అందరి నోళ్లను మూయించారు. ఆ రత్వాత కొన్నాళ్లకు రజనీ రాజకీయ ప్రస్తావన గురించిన ఊసేలేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా మళ్లీ రజనీ రాజకీయ ప్రవేశం, ఆయన గళం ఎవరికి చిక్కేనో అన్న ప్రస్తావనలు తెర మీదకు వస్తున్నాయి. ఇందుకు కారణం బీజేపీ పవనాలు దేశంలో వీస్తుండటమే. బీజేపీ వర్గాలతో సన్నిహితంగా రజనీకాంత్ ఉండేవారని చెప్పవచ్చు. ఇందుకు గతంలో ఆయన ఇచ్చిన 'వాయిస్' ఓ నిదర్శనం.
ఆ తర్వాత కొన్నాళ్లకు రజనీ రాజకీయ ప్రస్తావన గురించిన ఊసేలేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా మళ్లీ రజనీ రాజకీయ ప్రవేశం, ఆయన గళం ఎవరికి చిక్కేనో అన్న ప్రస్తావనలు తెర మీదకు వస్తున్నాయి. ఇందుకు కారణం బీజేపీ పవనాలు దేశంలో వీస్తుండటమే. బీజేపీ వర్గాలతో సన్నిహితంగా రజనీకాంత్ ఉండే వారని చెప్పవచ్చు. ఇందుకు గతంలో ఆయన ఇచ్చిన ‘వాయిస్’ ఓ నిదర్శనం.
వాయిస్: తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానప్పటికీ తన వాయిస్‌ను మాత్రం ఏదో ఒక పార్టీకి పరోక్షంగా రజనీ కాంత్ ఇస్తూనే ఉన్నారు. ఎన్నికల వేళ ఆయన ఈ పరోక్ష వ్యాఖ్యలు సంధించి, తద్వారా తన అభిమానులను ఆ పార్టీకి ఓట్లు వేసే రీతిలో సంకేతం ఇస్తున్నారు. 1996 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, దివంగత నేత మూపనార్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్‌కు మద్దతుగా, 1998లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, డీఎంకే కూటమికి, 2004 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అన్నాడీఎంకే కూటమికి మద్దతుగా పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
1996,1998 ఎన్నికల్లో తన వాయిస్ పనిచేసినా, 2004లో చతికిల బడటంతో రజనీ ఖంగు తిన్నారు. దీంతో 2009 లోక్ సభ ఎన్నికల్లో మౌనంగానే ఉన్నారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో తన మౌనాన్ని వీడిన రజనీ కాంత్ అన్నాడీఎంకేకు మద్దతుగా వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. అన్నాడీఎంకే అఖండ మెజారిటీ సాధించడంతో మళ్లీ రజనీ వాయిస్‌కు డిమాండ్ ఏర్పడింది. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో మెగా కూటమి ఆవిర్భవించనున్న దృష్ట్యా, తమకు మద్దతుగా రజనీ గళాన్ని సొంతం చేసుకునే పనిలో పడ్డాయి.
భేటీకి ప్రయత్నం: రజనీ వాయిస్ తమకు అనుకూలంగా మలచుకోవాలంటే తమ పార్టీ ప్రధాని అభ్యర్ధి మోడీ ద్వారా సంప్రదింపులు జరపాలన్న నిర్ణయానికి రాష్ట్ర పార్టీ వర్గాలు వచ్చాయి. గతంలో రజనీ అనారోగ్యంతో ఉన్న సమయంలో మోడీ పరామర్శించి ఉండటం, గుజరాత్‌లో జరుగుతున్న అభివృద్ధి, నదుల అనుసంధానం గురించి రజనీ కాంత్ కితాబు ఇచ్చిన సందర్భాలు ఉన్నారుు. నదుల అనుసంధానానికి తన వంతుగా గతంలో రూ. కోటి విరాళాన్ని సైతం ప్రకటించిన సందర్భం ఉంది. దీంతో మోడీని పీఎం చేయడానికి రజనీ కాంత్ తప్పకుండా తమకు సహకరిస్తారన్న ధీమాను కమలనాథులు వ్యక్తం చేస్తున్నారు. రజనీ కాంత్, మోడీల భేటీకి తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు.
రంగంలోకి చో: రజనీ కాంత్, మోడీల భేటీ ప్రయత్నాల అమలుకు చో రామస్వామిని రంగంలోకి దించారు. బీజేపీ వాదిగా, సీఎం జయలలితకు సన్నిహితుడిగా, తుగ్లక్ పత్రిక సంపాదకుడిగా, రజనీ కాంత్‌కు మంచి మిత్రుడిగా చో రామస్వామి వ్యవహరిస్తున్నారు. చో తన తొలి మద్దతును మోడీకి ప్రకటించడంతో, ఆయన ద్వారా రజనీ కాంత్ అపాయింట్ మెంట్ చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నారుు. ఈనెల ఎనిమిదో తేదీన ‘నమో’ మహానాడుకు నరేంద్ర మోడీ చెన్నై వస్తున్న దృష్ట్యా, అదే రోజు ఎలాగైనా వారి మధ్య భేటీకి ముహూర్తం కుదిర్చే పనిలో ఉన్నారు.
ఎనిమిదో తేదీ మిస్సయిన పక్షంలో రజనీకాంత్ మరి కొద్దిరోజులు చెన్నైలో ఉండరు. కోచ్చడయాన్ చిత్ర వ్యవహారం నిమిత్తం ఆయన ఈనెల పదిన చైనా వెళ్లేందుకు నిర్ణయించినట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రజనీ తమకు అనుకూలంగా వాయిస్ ఇచ్చిన పక్షంలో, అధికార పగ్గాలు చేపట్టాక, ఆయనకు రాజ్యసభ పదవి ఇవ్వడం ఖాయం అంటూ బీజేపీ సీనియర్ నేత ఒకరు ఆఫర్ ప్రకటించడం గమనార్హం. అయితే ఈ కథా నాయకుడు కమలనాథులకు చిక్కేనా అన్నది వేచి చూడాల్సిందే.!