సంపాదకీయం
మరికొన్ని రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఎవరిదన్న అనుమానాలు ఎవరికీ లేవు. అధికార పక్షమైన యూపీఏకు కూడా ఆ సంగతి తెలిసి చాన్నాళ్లయింది. దాదాపు సర్వేలన్నీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఆధిక్యత లభిస్తుందని ప్రకటించాయి. ఈ సానుకూ లతను ఆసరా చేసుకుని పాలించడానికి అవసరమైన కనీస మెజారిటీ 272 స్థానాలు కూటమికొచ్చేలా ఏం చేయాలన్న అంశంపైనే బీజేపీ ఇప్పుడు తన దృష్టిని కేంద్రీకరించింది. ఈ అంకెను చాలా సునాయా సంగా చేరుకోగలమని బీజేపీ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. అందుకు కారణం దేశంలో నరేంద్ర మోడీ గాలి బలంగా వీస్తుండటమే నని అంటున్నది. అదే సమయంలో ఈ గాలి నరేంద్ర మోడీదా, బీజేపీదా అనే మీమాంస కూడా ఆ పార్టీ సీనియర్ నేతల్లోనే ఎక్కువగా ఉన్నట్టు కనబడుతోంది. ఆ వివాదం సంగతలా ఉంచి ఉత్తరాదిన ఉన్నంత బలంగా దక్షిణాదిన బీజేపీ ప్రభావం ఉన్నదా అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. తమిళనాడులో ఆదివారం జరిగిన నరేంద్ర మోడీ పర్యటన ఈ అనుమానాలను మరింతగా బలపరుస్తోంది.
తమిళనాట ప్రధాన ద్రవిడ పార్టీలు డీఎంకే, అన్నా డీఎంకేలు రెండూ ఈసారి జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలో నిలిచాయి. యూపీఏ, ఎన్డీయే కూటములు రెండింటికీ తగిన మెజారిటీ వచ్చే పరిస్థితి లేదని, అలాంటప్పుడు ఎన్నికల అనంతరం వివిధ ప్రాంతాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై మూడో ఫ్రంట్ ఆవిర్భవించవచ్చునన్న వాదనలున్నాయి. ఈ నేపథ్యంలోనే జయలలిత బీజేపీకి దూరంగా ఉన్నారు. ఎన్నికల అనంతర పరిణామాలు కలిసివచ్చి తాను ప్రధాని పదవిని అందుకునే అవకాశం ఉండొచ్చన్నది ఆమె అంచనా. అంతమాత్రాన ఆమె బీజేపీని దూరం చేసుకొనే ఉద్దేశంలో లేరు. కనుకనే ఆ పార్టీకి వ్యతిరేకంగా జయ ఇన్నాళ్లుగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. గత్యంతరంలేని స్థితిలో చిన్నా చితకా ప్రాంతీయ పక్షాలతో ఫ్రంట్ కట్టినా...ఎన్నికల అనంతరం ఆమె సహజంగా తమవైపే వస్తారని అటు బీజేపీ కూడా అంచనా వేసుకుంది.
అందువల్లే జయలలితపై ఇంత వరకూ ఎలాంటి విమర్శలూ చేయలేదు. కానీ, హఠాత్తుగా బీజేపీ తన ఎత్తుగడలను మార్చింది. భవిష్యత్తులో జయలలిత తీసుకునే నిర్ణయంతో నిమిత్తంలేకుండా ఆ రాష్ట్రంలో కొత్త మిత్రులను అన్వేషించాలన్న నిర్ణయానికొచ్చింది. అందువల్లే నరేంద్ర మోడీ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇంటికెళ్లి అరగంటసేపు గడిపారు. అందుకు బదులుగా రజనీకాంత్ మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన దృఢమైన నాయకుడన్నారు. ఆయనకు భవిష్యత్తులో అంతా మంచే జరగాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నట్టు చెప్పారు. రజనీకాంత్‌కు పార్టీ లేకపోవచ్చు... ఆయన ఎన్నికల్లో పోటీచేయకపోవచ్చు. కానీ, ఆయనకు రాష్ట్రమంతటా అభిమానులున్నారు. ఈ ఆలోచనే మోడీని రజనీకాంత్ ఇంటివైపు నడిపించింది. అయితే, రజనీకాంత్ నటనకు సమ్మోహితుల య్యే అభిమానులు ఉండొచ్చుగానీ, వారంతా ఆయన చెప్పినవారికే ఓటే స్తారన్న నమ్మకంలేదు. 2004లో ఆయన బీజేపీకి ఓటేయమని పిలుపునిచ్చినా అప్పుడు డీఎంకే-కాంగ్రెస్ కూటమే ఘనవిజయం సాధించింది.
దేశమంతా మోడీ గాలి వీస్తున్నదన్న ప్రచారంపై నిజంగా బీజేపీకి విశ్వాసం ఉంటే ఆ పార్టీ ఇలాంటి ఎత్తుగడలకు దిగాల్సిన అవసరమే లేదు. పైగా గత అయిదు దశాబ్దాలుగా ఆ రాష్ట్ర ప్రజలు డీఎంకే, అన్నాడీఎంకేలు మినహా మరే ఇతర పక్షాన్నీ ఎంచుకోలేదు. ఆ రెండు ప్రాంతీయ పార్టీలతో కూటములు కట్టినప్పుడు జాతీయ పార్టీలను ఆదరించారు తప్ప ఒంటరిగా వచ్చినప్పుడు తిరస్కారభావాన్నే ప్రదర్శించారు. ఈ పరిస్థితిని మార్చేంత పరిణామాలు ఇప్పటికైతే ఏమీ లేవు. నరేంద్ర మోడీ రజనీకాంత్ ఇంటికెళ్తున్నారని తెలిసిన వెంటనే జయలలిత సైతం తన ఎత్తుగడలను మార్చారు. బీజేపీ, కాంగ్రెస్‌లను ఒకే గాటన కట్టి ఆ రెండు పార్టీలూ తమిళనాడు ప్రజలకు న్యాయంగా దక్కాల్సిన కావేరీ జలాల విషయంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కర్ణాటకలో సీట్లు దక్కించుకోవడం కోసమే ఆ పార్టీలు తమిళనాడుకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. అలాగని ఆమె బీజేపీ ‘మతతత్వ’ సిద్ధాంతాలనుగానీ, 2002లో గుజరాత్‌లో జరిగిన ఊచకోత అంశాన్నిగానీ ప్రస్తావించలేదు. కనుక ఎన్నికల అనంతరం బీజేపీకి చేరువయ్యే అవకాశాలను వదులుకునేందుకు ఆమె సిద్ధంగా లేరని అర్ధమవుతుంది. అటు నరేంద్ర మోడీ కూడా జయలలితపై ఉన్న అవినీతి ఆరోపణల జోలికి పోలేదు. ఆమెపై ఘాటు విమర్శలకు దిగలేదు. డీఎంకే, అన్నాడీఎంకేలు రెండూ పరస్పర కక్ష సాధింపులకు దిగుతూ ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలాయని మాత్రమే ఆరోపించారు.
ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ వేస్తున్న అడుగులనుబట్టి ఆ పార్టీ ఎదుర్కొంటున్న డైలమా అర్ధమవుతుంది. ఒక్క తమిళనాట మాత్రమే కాదు... కర్ణాటకలో కూడా బీజేపీకి అనుకున్నంతగా అనుకూల పవనాలు లేవు. యడ్యూరప్ప తిరిగి బీజేపీలో చేరినా లింగాయత్‌లు ఆ పార్టీకి మునపటంత సాన్నిహిత్యం కాలేదని సర్వేలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సైతం టీడీపీతో జట్టుకట్టి ఆ పార్టీ పొత్తులో దక్కించుకున్న ఎంపీ స్థానాలు అయిదే. ఇక తెలంగాణలో ఆ రెండు పార్టీల పొత్తుపైనా ఎంతటి వ్యతిరేకత ఉన్నదో ప్రత్యక్షంగానే కనబడుతోంది. మోడీ గాలి బలంగా వీస్తున్నదని ఎంత చెబుతున్నా దక్షిణాదికొచ్చేసరికి బలహీనంగా ఉన్నామని కమలనాథులు గుర్తించడంవల్లే ఇక్కడ బీజేపీ దూకుడును ప్రదర్శించలేకపోతున్నదని అర్ధమవుతుంది. వింధ్య దాటని ప్రభంజనంతో ఢిల్లీలో ఎన్డీయేకు తిరుగులేని మెజారిటీ సాధ్యమేనా?
వింధ్య దాటని ప్రభంజనం!
Published Tue, Apr 15 2014 2:02 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement