చెన్నై ర్యాలీలో మోదీతో పళనిస్వామి, సెల్వం, రామదాస్
సాక్షి, చెన్నై: బలమైన భారత్ లక్ష్యంగా ముందుకు సాగుదామని, మరో అవకాశం ఇస్తే కలలు సాకారం చేస్తానని తమిళ ఓటర్లను ప్రధాని మోదీ బుధవారం కోరారు. చెన్నై శివారు కిలాంబాక్కం వేదికగా అన్నాడీఎంకే మెగా కూటమి నేతృత్వంలో ఎన్నికల శంఖారావ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. పుల్వామా దాడులు, ప్రతిదాడులు, వింగ్ కమాండర్ అభినందన్ మళ్లీ భారత్‌కు రావడాన్ని గుర్తు చేస్తూ, తీవ్రవాదంపై పోరాటంలో వెనక్కు తగ్గేది లేదన్నారు. ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధమేనని ప్రకటించారు. తమిళనాట అన్నాడీఎంకే–బీజేపీ నేతృత్వంలోని మెగా కూటమి ఖరారు అయింది.
పొత్తులో భాగంగా తమిళనాడులో బీజేపీకి–5, పీఎంకేకు–7, పుదియ తమిళగం–1, పుదియ నిధి కట్చి –1, ఎన్‌ఆర్ కాంగ్రెస్‌కు పుదుచ్చేరిలోని దక్కాయి. మరికొన్ని చిన్న పార్టీలు కూటమిలో ఉన్న సీట్ల కేటాయింపులు అధికారికంగా వెలువడాల్సి ఉంది. మిగిలిన సీట్లలో అన్నా డీఎంకే పోటీ చేయనుంది. ఈ బహిరంగ సభతో పాటు అధికారిక వేడుక నిమిత్తం బుధవారం మోదీ చెన్నైకు వచ్చారు. ముందుగా తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వంతో కలిసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. భారతరత్న ఎంజీఆర్ పేరును చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌కు పెడుతున్నట్లు మోదీ ప్రకటించారు.
కర్ణాటకలో రిమోట్ కంట్రోల్ సీఎం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక కలబురిగిలో బీజేపీ ఎన్నికల సభలోనూ మోదీ పాల్గొన్నారు. ‘ రాష్ట్ర సీఎం కుమారస్వామి ఒక రిమోట్ కంట్రోల్ సీఎం. రాష్ట్రంలో ఒక బలహీనమైన ప్రభుత్వం పాలన సాగిస్తోంది’ అని విమర్శించారు. రాష్ట్రంలో దొంగలు, అవినీతిపరుల దుకాణం బంద్ చేయడానికి సమయం ఆసన్నమైందన్నారు. రైతులకు నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించిన తర్వాత దీన్ని కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయని, అందులో కర్ణాటక ప్రభుత్వం కూడా ఒకటని ఆరోపించారు. ఎలాంటి అవినీతికీ తావు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకే నగదు బదిలీ చేస్తుండడంతో కమీషన్లకు అలవాటు పడిన రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.
మోదీ విరాళం 21 లక్షలు
ప్రధాని మోదీ తన దాతృత్వాన్ని మరోసారి చాటారు. కుంభమేళాలో పని చేసిన పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం తన సంపాదన నుంచి రూ.21 లక్షలు విరాళంగా ఇచ్చినట్టు ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment