రజనీ కోసం రాయబారం?
సాక్షి ప్రతినిధి, చెన్నై:
రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంకేతాలిచ్చిన తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను తమవైపు లాక్కునేందుకు బీజేపీ ప్రముఖుల ద్వారా ప్రయత్నాలు సాగుతున్నాయా? ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. జరుగుతున్న పరిణామాలు గమనిస్తే రజనీకాంత్ మనసును బీజేపీ వైపు మళ్లించే ప్రయత్నాలు ముమ్మరంగానే సాగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ముంబైలో రజనీకాంత్‌ను కలిసి చర్చలు జరిపారు. ఈ చర్చల సారాంశం తమిళనాట రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్ తన తాజా చిత్రం కాలా షూటింగ్ నిమిత్తం ముంబైలో ఇటీవల కొన్నిరోజులున్నారు. ముంబైలో రజనీకాంత్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (బీజేపీ) సతీమణి అమృత కలసిన ఫొటో శుక్రవారం వెలుగు చూసింది. ‘రజనీకాంత్‌ను కలిశాను, సమాజంలో నెలకొన్న పరిస్థితులు, సమస్యలు, వాటి పరిష్కారాలపై ఇద్దరం చర్చించుకున్నాం’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.
ఆమె ట్వీట్ రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. దక్షిణాదిలో బలం కోసం బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇందులో భాగంగా అత్యంత ప్రజాకర్షణ కలిగిన సూపర్ స్టార్ ను ఆహ్వానించే ప్రతిపాదనను బీజేపీ తరఫున అమృత ఈ సందర్భంగా రజనీకాంత్ ముందు ఉంచారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.