ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గితే చాలు.. హస్తిన అగ్రపీఠం అందుకోడానికి మార్గం సుగమం అవుతుందని బీజేపీ భావిస్తోంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గితే చాలు.. హస్తిన అగ్రపీఠం అందుకోడానికి మార్గం సుగమం అవుతుందని బీజేపీ భావిస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ జాతీయాధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ స్వయంగా చెప్పారు. ''ఢిల్లీ దేశానికి గుండెకాయ లాంటిది. మనమిక్కడ గెలిస్తే, దేశమంతా గెలుస్తాం'' అని దాదాపు వెయ్యిమందికిపైగా కార్యకర్తలు పాల్గొన్న కార్యక్రమంలో ఆయన అన్నారు. ఈ ఏడాది ఆఖర్లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ఆయన తాల్కతోరా స్టేడియంలో ప్రారంభించారు.
ఢిల్లీ అసెంబ్లీలో దాదాపు 14 ఏళ్లుగా బీజేపీకి అధికారం అందని ద్రాక్షగానే ఉంది. 14 ఏళ్ల కాంగ్రెస్ పాలన దేశ రాజధానిని భ్రష్టుపట్టించిందని, సగానికి పైగా నగరం మురికివాడలేనని రాజ్నాథ్ మండిపడ్డారు. కార్యకర్తలంతా ఒక్క మాటమీద నిలబడి, కష్టపడి కృషిచేసి పార్టీని విజయతీరాలకు చేర్చాలని కోరారు. ప్రజలు మార్పుకోసం చూస్తున్నారని ఆయన తెలిపారు. పార్టీ మాజీ అధ్యక్షుడు, ఢిల్లీ వ్యవహారాల ఇన్చార్జి నితిన్ గడ్కరీ కూడా షీలా సర్కారు పాలనపై ధ్వజమెత్తారు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, విద్యుత్ చార్జీలు మండిపోతున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో బోధన నాసిగా ఉందని, ఆహార పదార్థాల ధరలు ఆకాశంలో ఉన్నాయని అన్నారు.
బీజేపీ అధికారంలోకి వస్తే 24 గంటలూ తాగునీరు, విద్యుత్ బిల్లుల్లో 30 శాతం తగ్గింపు, మహిళలకు భద్రత కల్పిస్తామని బీజేపీ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ గోయల్ హామీ ఇచ్చారు. సమావేశంలో పాల్గొన్న నాయకులంతా ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీని ఆకాశానికెత్తేశారు. మోడీని ఎదుర్కోడానికి కాంగ్రెస్లో ఒక్క పేరు కూడా లేదని సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు అన్నారు.