’అయ్యప్ప ఆలయంలోకి మహిళలు’
- సీనియర్ బీజేపీ నేత మద్దతు
తిరువనంతపురం: ప్రఖ్యాత శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలోకి అన్ని వయస్సులకు చెందిన మహిళల ప్రవేశానికి బీజేపీ సీనియర్ నేత ఒకరు మద్దతు పలికారు. అయ్యప్పస్వామి స్త్రీ ద్వేషి కాదని పేర్కొన్నారు. మహిళల్లో రుతుస్రావక్రమం ప్రకృతి ధర్మమని, దానిని పవిత్రంగా చూడాలని ఆయన కోరారు.
కేరళ బీజేపీ జనరల్ సెక్రటరీ కే సురేంద్రన్ ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఒక పోస్టు పెట్టారు. అంతేకాకుండా అయ్యప్ప ఆలయాన్ని భక్తుల దర్శనం కోసం ఏడాది పొడుగుతా తెరిచి ఉంచాలన్న సూచనను ఆయన సమర్థించారు. ఆలయాన్ని ఏడాది పొడుగుతా తెరిచి ఉంచడం వల్ల వార్షిక మాలధారణ యాత్ర సమయంలో (నవంబర్-జనవరి)లో భక్తుల రద్దీ తక్కువగా ఉండే అవకాశముందని చెప్పారు.
‘అయ్యప్పస్వామి నైష్ఠిక బ్రాహ్మచారి. కానీ, ఆయన స్త్రీ ద్వేషి కాదు. శబరిమలలో తన పక్కనే దేవత అయిన మల్లికాపురతమ్మకు చోటు కల్పించిన విషయాన్ని మనం మరువకూడదు’ అని 46 ఏళ్ల సురేంద్రన్ పేర్కొన్నారు. హిందూమతం తార్కికతను ఒప్పుకోవడానికి సదా సిద్ధంగా ఉంటుందని, కాబట్టి మహిళలకు ఆలయ ప్రవేశం విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. అయ్యప్ప దేవాలయంలో మహిళల ప్రవేశం అంశంపై కేరళలో రాజకీయా పార్టీల నేతలు, స్వచ్ఛంద కార్యకర్తల మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఈ అభిప్రాయాలను వెలువరించారు.