కమలానికి ‘కరెంటు’ గుబులు!
మధ్యప్రదేశ్‌లో వ్యవసాయానికి సరిగ్గా విద్యుత్ ఇవ్వలేకపోయిన చౌహాన్ సర్కారు
ఎన్నికల్లో ఆ అంశం ప్రతికూలంగా మారే అవకాశం
రైతులను ఆకర్షిస్తున్న కాంగ్రెస్ ఉచిత విద్యుత్ హామీ
మధ్యప్రదేశ్ నుంచి సాక్షి ప్రతినిధి ప్రవీణ్ కుమార్ లెంకల: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి ‘కరెం టు కష్టాలు’ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో 60 శాతం బోర్లు, బావులపై ఆధారపడిన వ్యవసాయ రంగానికి శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ సర్కారు గత ఐదేళ్లుగా ఆశించిన స్థాయిలో విద్యుత్ సరఫరా చేయలేకపోవడం ఎన్నికల్లో ఆ పార్టీపై ప్రభా వం చూపవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 50 జిల్లాలున్న మధ్యప్రదేశ్‌లో బేతుల్, చింద్వాడ, బాలాఘాట్, డిండౌ రీ, అన్నుపూర్, ఉమరియా, షెహడోల్, సీథీ జిల్లాల్లో సాగునీటి సదుపాయం లేకపోవడంతో రైతులు వర్షాధారంగానే పంటల ను సాగుచేస్తున్నారు.
రీవా, సత్‌నా, పన్నా తదితర జిల్లాల్లో రైతులు బోర్లు, బావుల ద్వారా పంటలు సాగుచేస్తున్నా పొలాలకు రోజుకు కేవలం నాలుగైదు గంటలే కరెంటు సరఫరా అవుతోంది. దీనికితోడు నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు కరెంటు కోతలు అమలవుతున్నాయి. మాండ్‌లా, డిండోరి తదితర జిలా ్లల్లో అధిక నీరు అవసరమైన వరి పంటను కూడా వర్షాధారంగానే పండిస్తుండటం రైతుల కరెంటు కష్టాల తీవ్రతను తెలి యజేస్తోంది. పంటకాలం మధ్యలో వర్షాలు పడకపోతే బోర్లు వేయించుకునే స్థోమతలేని ఇక్కడి రైతులు సమీపంలోని వాగులు, వంకల నుంచి డీజిల్ ఇంజిన్ల ద్వారా తాత్కాలిక పైపులైన్లు వేసుకోవడం, లేదా ఎడ్లబండ్లలో డ్రమ్ముల ద్వారా నీరు తెచ్చుకోవలసిన దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రైతులు కాంగ్రెస్ ఇచ్చిన ఎన్నికల వాగ్దానంవైపు ఆశగా చూస్తున్నారు. ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే రూ.51 వేల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని, వ్యవసాయానికి ఆరు నెలలపాటు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇవ్వడం రైతులను ఆకర్షిస్తోంది. ఈ పరిణామం అధికార బీజేపీలో గుబులు పుట్టిస్తోంది.