మధ్యప్రదేశ్‌లో బీజేపీకి సంకటం!
ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడంపై కార్యకర్తల ఆగ్రహం
వారికి టికెట్లు రద్దు చేయాలంటూ నిరసనలు అసమ్మతి నేతల నుంచీ ఇబ్బందులు
భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ అధికార బీజేపీ కఠిన పరీక్ష ఎదుర్కొంటోంది. 147 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించిన ప్పటి నుంచీ అసమ్మతి జ్వాలలతో సతమతమవుతున్న పార్టీపై తాజాగా కార్యకర్తలు తిరుగుబాటుకు సిద్ధమవడం ఆ పార్టీని కలవరపెడుతోంది. ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్లు కేటాయించడంపై కార్యకర్తలు ఆగ్రహించడం, వారికి టికెట్లను రద్దు చేయాలంటూ వీధికెక్కడం ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్రసింగ్ తొమర్ సహా రాష్ట్ర నాయకత్వానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. ముఖ్యంగా అటవీశాఖ మంత్రి సర్తాజ్ సింగ్ టికెట్‌ను రద్దు చేయాలంటూ కార్యకర్తలు భోపాల్‌లోని పార్టీ కార్యాలయం వెలుపల నిరసన ప్రదర్శనలు చేపట్టారు. టికెట్‌ను రద్దు చేయకుంటే అన్ని పార్టీ పదవులకు రాజీనామా చేస్తానని రెబెల్ నేత యోగేంద్రసింగ్ మండ్లోయ్ హెచ్చరించారు.
అయితే కార్యకర్తల చర్య మొదటి జాబితా ప్రకటించాక వచ్చిన తొలి స్పందనేనంటూ బీజేపీ చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ భారీగా ఉన్న నిరసనకారుల సంఖ్య ఈ విషయంలో పార్టీపై వ్యతిరేకతను చెప్పకనే చెబుతోంది. ‘‘మా మనోభావాలను పట్టించుకోకపోతే అభ్యర్థులను ప్రచారం కూడా చేసుకోనివ్వం’’ అని ఓ బీజేపీ కార్యకర్త పేర్కొన్నాడు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితిని బీజేపీ ఎదుర్కొంటోంది. మరోవైపు ఇప్పటికే టికెట్ దక్కనందుకు నిరసనగా పంచాయతీరాజ్‌శాఖ సహాయ మంత్రి దేవీసింగ్ సరేయం బీజేపీకి గుడ్‌బై చెప్పి గోండ్వానా గణతంత్ర పార్టీ తరఫున పోటీ చేసే యోచనలో ఉండగా మరికొందరు కూడా అదే బాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల ఆగ్రహాన్ని చల్లార్చేందుకు అభ్యర్థుల రెండో జాబితాలో ప్రజావ్యతిరేక ఎమ్మెల్యేలు, మంత్రులకు టికెట్లు ఇవ్వరాదని బీజేపీ భావిస్తోంది. కానీ తొలి జాబితాలో కేటాయించిన టికెట్లను రద్దు చేయడంపై మల్లగుల్లాలు పడుతోంది. అయితే ముందుగా కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా ప్రకటించే వరకూ వేచి చూడాలని యోచిస్తోంది. తద్వారా ఆ పార్టీ అసంతృప్తుల నుంచి పెల్లుబుకే వ్యతిరేకత తమ పార్టీ క్యాడర్‌లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతతో సమానం కాగలదని ఆశిస్తోంది.
ఛత్తీస్‌గఢ్ మళ్లీ కమలానిదే!
న్యూఢిల్లీ: త్వరలో జరగబోయే ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ విజయఢంకా మోగిస్తుందని ఏబీపీన్యూస్- దైనిక్ బాస్కర్-నీల్సన్ సర్వే వెల్లడించింది. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రమణ్ సింగ్ హ్యాట్రిక్ కొడతారని తెలిపింది. ఆ ముందస్తు సర్వే వివరాలు..
90 సీట్లున్న అసెంబ్లీలో 44 శాతం ఓట్లతో బీజేపీ 60 సీట్లను కైవసం చేసుకుంటుంది.
కాంగ్రెస్‌కు 27, స్వతంత్రులకు 3 సీట్లు దక్కుతాయి.
నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన దక్షిణ, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ లాభపడి వరుసగా 12, 17 సీట్లు సాధిస్తుంది.
మధ్య ఛత్తీస్‌లో కాంగ్రెస్ గతం కన్నా 7 సీట్లు నష్టపోయి 16 సీట్లతో సరిపెట్టుకుంటుంది.
దేశంలో నిత్యావసరాల రేట్లు పెరిగినా రాష్ట్రంలో ఆ ప్రభావం లేకుండా చూసుకోవడమే బీజేపీకి లాభించిందని సర్వే చెప్పింది.
నక్సలిజాన్ని కూడా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడడం కూడా ఓటింగ్ శాతం పెరగడానికి కారణమని పేర్కొంది.