కొత్త రేషన్ కార్డులపై ఆయన ఫోటో
వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సమాజ్వాద్ పార్టీ చీప్ ట్రిక్కులకు పాల్పడుతుందట. కొత్త రేషన్ కార్డులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఫోటోలు ముద్రించి జారీచేస్తుడటంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలు పెట్టేందుకే ఇలాంటి పనులు చేస్తుందని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ఇది ఓ పనికిమాలిన చర్యగా అభివర్ణిస్తున్నాయి. కొత్త రేషన్కార్డులపై ముద్రించిన అఖిలేష్ ఫోటోను ప్రభుత్వం వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో తాము ఎన్నికల కమిషన్ను ఆశ్రయిస్తామని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య హెచ్చరించారు.
ప్రతిపక్షాలు బీజేపీ, కాంగ్రెస్లు ఈ విషయంపై అనవసరంగా ఎగిరెగిరి పడుతున్నాయని, ఈ విషయానికి కొంచెం తక్కువ ప్రాధాన్యం ఇస్తే బాగుంటుందని అఖిలేష్ సుత్తిమెత్తంగా హెచ్చరించారు. ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారో తెలియడం కోసం ఇది ఎంతో అవసరమన్నారు. రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి ఫోటోగ్రాఫ్ ఎందుకని ప్రజలు ప్రశ్నించవచ్చని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ తాము పేదవారికి సాయపడుతుంటే, దానికీ కొంత పబ్లిసిటీ తాము ఇచ్చుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వారికోసం ఎవరు పనిచేస్తున్నారో వారికి తెలియాల్సి ఉందన్నారు.
అయితే ఇది కేంద్రప్రభుత్వ పథకమని, ఆహార ధాన్యాలు కేంద్ర ద్వారానే ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. మార్చి1నుంచి అమల్లోకి వచ్చిన నేషనల్ ఫుడ్ సెక్యురిటీ యాక్ట్ కింద 3.15 కోట్ల రేషన్ కార్డులను రాష్ట్రం ముద్రించి జారీచేయాల్సి ఉంటుంది. ఈ చట్టం కింద జారీచేసిన కొత్త కార్డులు కలిగి ఉన్న వారికి నెలకు 35 కిలోల ఆహార ధాన్యాలు, గ్రస్తీ కార్డు హోల్డర్స్కు 5 కేజీల ఆహార ధాన్యాలు అందనున్నాయి.