ముఖ్యమంత్రి ‘ఘర్‌వాపసి’!!
బీజేపీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ మధ్య రోజురోజుకు అనుబంధం బలపడుతున్నట్టు కనిపిస్తోంది. బిహార్ సీఎం నితీశ్‌పై తాజాగా బీజేపీ చీఫ్ అమిత్ షా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ప్రతిపక్ష ముఖ్యమంత్రులంటే చాలు సహజంగా విరుచుకుపడే అమిత్ షా.. నితీశ్‌కుమార్‌ను విమర్శించాల్సిన అవసరం లేదని అన్నారు. అవినీతి రహిత స్వచ్ఛమైన పాలనను ఆయన అందిస్తున్నారని, ఏ విషయంలోనూ ఆయన పట్టుబడటం లేదని, అలాంటప్పుడు నితీశ్‌ను విమర్శించాల్సిన అవసరమేముందని తాజాగా ఇండియా టుడే ఎడిటర్స్ రౌండ్‌టేబుల్ సదస్సులో షా పేర్కొన్నారు. నితీశ్‌ను విమర్శించబోనని చెప్పిన ఆయన అదేసమయంలో లాలూ ప్రసాద్ అవినీతిపరుడంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
మొత్తానికి ఒకప్పటి బీజేపీ దోస్త్ అయిన నితీశ్‌కుమార్ ఆ పార్టీలో మోదీ ఎదుగుదలను వ్యతిరేకిస్తూ తెగదెంపులు చేసుకున్నారు. కానీ ఇటీవల ఆయన మోదీ ప్రశంసకుల్లో ఒకరిగా మారిపోయారు. మోదీ చేపట్టిన పెద్దనోట్ల రద్దును నితీశ్ గట్టిగా సమర్థించి.. ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మళ్లీ నితీశ్-బీజేపీ మధ్య స్నేహం చిగురించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ‘ఘర్‌వాపసి’ చేసి తిరిగి ఎన్డీయే గూటిలో చేరవచ్చునని ఊహాగానాలు వస్తున్నాయి.