నితీశ్ కొత్త కేబినెట్ ఏర్పాటు
► 27 మందికి చోటు
► జేడీయూ నుంచి 14 మంది, బీజేపీ నుంచి 12 మంది
పట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ శనివారం తన నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి 27 మందిని మంత్రిమండలిలోకి తీసుకున్నారు. వీరిలో ఆయన సొంత పార్టీ జేడీయూ నుంచి 14 మంది, బీజేపీ నుంచి 12 మంది, ఎల్జేపీ నుంచి ఒకరు ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎల్పీ, హిందూస్తానీ ఆవాం మోర్చా(హెచ్‌ఏఎం) నుంచి ఎవరినీ తీసుకోలేదు. గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
వీరిలో గత జేడీయూ–ఆర్జేడీ–కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ హయాంలో విపక్ష నేతగా పనిచేసిన ప్రేమ్‌కుమార్(బీజేపీ), కేంద్ర మంత్రి పాశ్వాన్ సోదరుడు పశుపతికుమార్ పరస్(ఎల్జేపీ) ఉన్నారు. కార్యక్రమానికి నితీశ్, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ తదితరులు హాజరయ్యారు. ఆర్జేడీతో విభేదాల నేపథ్యంలో నితీశ్ సీఎం పదవికి రాజీనామా చేసి, బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. నితీశ్, సుశీల్ గురువారం సీఎం, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేయగా, కొత్త ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో బలం నిరూపించుకుంది.