జేడీయూలో రగిలిన చిచ్చు!
► శరద్ యాదవ్ తీవ్ర అసంతృప్తి
► నితీశ్ తీరును తప్పుపట్టిన ఇద్దరు ఎంపీలు
పట్నా, న్యూఢిల్లీ: కమలం పార్టీతో నితీశ్ కుమార్ దోస్తీ జేడీయూలో చిచ్చు రాజేసింది. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుపై జేడీయూలో ఒక వర్గం తీవ్ర అసంతృప్తిగా ఉంది. ఇప్పటికే ఇద్దరు జేడీయూ ఎంపీలు బహిరంగంగా నితీశ్ తీరును తప్పుపట్టగా... పార్టీ సీనియర్ నేత శరద్ యాదవ్ కూడా గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ రెండుగా చీలనుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. బుధవారం రాత్రి నుంచి చోటుచేసుకున్న పరిణామాలపై జేడీయూ మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ ఇంతవరకూ నోరు మెదపకపోవడంపై పలు వాదనలు విన్పిస్తున్నాయి.
బిహార్‌లో మహాకూటమి కొనసా గాలనేదే యాదవ్ అభిమతమని, నితీశ్ తీరుపై అసంతృప్తిగా ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. కావాలనే నితీశ్ ప్రమాణస్వీకారానికి యాదవ్ గైర్హాజరైనట్లు భావిస్తున్నారు. అదే సమయంలో రాహుల్‌తో ఆయన భేటీ కావడం చర్చనీయాంశమైంది. నితీశ్‌ను రాహుల్ విమర్శించిన కొద్దిసేపటికే వీరిద్దరూ కలిశారు. ఏం చర్చించారన్నది తెలియరాలేదు. ఇటీవలి కాలంలో జరిగిన విపక్షాల భేటీలో బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా పోరాడేందుకు జేడీయూ కట్టుబడి ఉందని శరద్ అన్నారు. బీజేపీకి నితీశ్ దగ్గరవుతున్న నేపథ్యంలోనే విపక్షాలకు ఆయన వివరణ ఇచ్చారు. మూడ్రోజుల క్రితం రాజ్యసభలో గోరక్షణ హత్యలపై మాట్లాడుతూ.. దేశంలో తాలిబాన్ల పాలన కొనసాగుతుందని బీజేపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు.
ఢిల్లీలో ఉన్న జేడీయూ సీనియర్ నేతలతో గురువారం సాయంత్రం యాదవ్ సమావేశమై పార్టీ భవితవ్యంపై చర్చించారు. బీజేపీతో పొత్తు అంశాన్ని పార్టీలో కనీసం చర్చించలేదని, శరద్ యాదవ్ అభిప్రాయాన్ని అడగలేదని భేటీలో పాల్గొన్న జేడీయూ ఎంపీ అన్వర్ అలీ చెప్పారు. అన్వర్‌తో పాటు జేడీయూ కేరళ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ వీరేంద్ర కుమార్ కూడా నితీశ్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. తాను షాక్‌కు గురయ్యాయనని, కేరళ విభాగం ఎట్టి పరిస్థితుల్లోను ఎన్డీఏతో జట్టుకట్టదని చెప్పారు. మహారాష్ట్రలో ఏకైక జేడీయూ ఎమ్మెల్సీ కపిల్ పాటిల్ స్పందిస్తూ.. బీజేపీతో కలిసేందుకు నితీశ్ తొందర తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఈ నిర్ణయంతో ఎంతో బాధపడ్డామని.. జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని చెప్పారు.