నితీశ్‌ బలమెంత? | Who is the most popular leader in Bihar? | Sakshi
Sakshi News home page

నితీశ్‌ బలమెంత?

Published Sat, Jul 29 2017 2:31 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

నితీశ్‌ బలమెంత? - Sakshi

నితీశ్‌ బలమెంత?

బిహార్‌లో అత్యంత ప్రజాకర్షక శక్తి కలిగిన నాయకుడు ఎవరు?
‘ఇదేమి ప్రశ్న...అవినీతి మచ్చలేని నాయకుడు, అభివృద్ధి కాముకుడు, 13 ఏళ్లుగా సీఎంగా ఉన్న నితీశ్‌ కుమార్‌ కదా బిహార్‌లో అత్యంత జనాకర్షక నేత, ఆ మాత్రం తెలియదా’ అని ఎవరైనా అనుకోవడం ఖాయం.కాని ఇది వాస్తవం కాదని ఓట్ల లెక్కలు చెబుతున్నాయి.ప్రతి 100 మంది బిహారీల్లో కేవలం 17 మంది మాత్రమే నితీశ్‌ పార్టీ జేడీయూకు ఓటేస్తున్నారు.

2004 నుంచి జరిగిన ఆరు ఎన్నికల్లో జేడీయూకు పోలైన సగటు ఓట్ల శాతమిది. సంకీర్ణ ప్రభుత్వాలకు సారథ్యం వహిస్తూ 13 ఏళ్లు బిహార్‌ సీఎం కుర్చీలో కూర్చున్న నితీశ్‌ బుధవారం మహాకూటమి నుంచి నిష్క్రమించి మళ్లీ బీజేపీ పంచన చేరిన నేపథ్యంలో ‘ఇండియా స్పెండ్‌’ అనే వెబ్‌సైట్‌... వాస్తవానికి ఎవరి బలమెంతనే లెక్కలు తీసింది. ఇందులో నితీశ్‌కు దేశవ్యాప్తంగా ఉన్న ఇమేజ్‌కు, బిహార్లో ఆయన పార్టీకి పడుతున్న ఓట్లకు పొంతనే లేదని తేలింది.

2004 లోక్‌సభ, 2005 అసెంబ్లీ, 2009 లోక్‌సభ, 2010 అసెంబ్లీ, 2014 లోక్‌సభ, 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీలకు పోలైన ఓట్ల శాతాన్ని లెక్కించి సగటు తీస్తే... బీజేపీ 37 శాతంతో ప్రథమస్థానంలో ఉంది. లాలూ పార్టీ ఆర్జేడీ 30 శాతం ఓట్లతో రెండోస్థానంలో ఉండగా... జేడీయూ 17 శాతంతో తృతీయ స్థానంలో ఉంది. 10 శాతం ఓట్లున్న కాంగ్రెస్‌ది నాలుగోస్థానం. పైన పేర్కొన్న ఆరు ఎన్నికల్లో సంకీర్ణ భాగస్వాములు మారారు. పొత్తులు మారాయి. అయితే ఏదో ఒక సందర్భంలో పైన పేర్కొన్న నాలుగు పార్టీలు... ఒంటరిగా పోటీచేశాయి. అప్పుడు వచ్చిన ఓట్లు కూడా ఆరు ఎన్నికల సగటుకు దగ్గరగా ఉండటం విశేషం. 2009, 2010లో ఒంటరిగా పోటీచేసినపుడు ఆర్జేడీ 27 శాతం దాకా ఓట్లు సాధించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసిన జేడీయూ 15.8 శాతం ఓట్లు, రెండు సీట్లు గెలుపొందింది.

నిలకడగా బీజేపీ బలం...
2004 నుంచి తీసుకుంటే... అన్ని ఎన్నికల్లోనూ (పొత్తులు ఉన్నా, లేకున్నా) బీజేపీ ఓట్ల శాతం ఎప్పుడూ 35 శాతానికి తగ్గకపోవడం గమనార్హం. మోదీ జాతీయ రాజకీయాల్లోకి రావడానికి దశాబ్దకాలం ముందునుంచే బిహార్లో బీజేపీకి మంచి ఆదరణ ఉందని దీన్నిబట్టి చెప్పొచ్చు. పైగా ఎవరితోనైనా పొత్తు ఉన్నపుడే... జేడీయూ ఓట్లు పెరుగుతున్నాయి. 2009 నుంచి 2015 మధ్య జరిగిన నాలుగు ఎన్నికల్లో... ఓ 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతిసారీ జేడీయూ అభ్యర్థే రంగంలో ఉన్నారు (లోక్‌సభ ఎన్నికల్లో అయితే జేడీయూ అభ్యర్థి పోటీలో ఉన్న ఎంపీ నియోజకవర్గం పరిధిలోకే ఈ 55 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి). పొత్తుతో ఎన్నికలకు వెళ్లినపుడు ఈ 55 నియోజకవర్గాల్లో జేడీయూకు 43 శాతం ఓట్లు పడ్డాయి. అదే ఒంటరిగా వెళ్లినపుడు 22 శాతం ఓట్లే వచ్చాయి.

పొత్తుల కారణంగానే జేడీయూ ఎక్కువగా లాభపడిందనడానికి మరో ఉదాహరణ 2015 అసెంబ్లీ ఎన్నికలు. ఆర్జేడీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీచేశాయి. ఆర్జేడీ బరిలో ఉన్న సగం నియోజకవర్గాల్లో జేడీయూ ఓట్ల బదలాయింపు పరిపూర్ణంగా జరగలేదు. అయినప్పటికీ ఆర్జేడీ 80 స్థానాల్లో గెలిచింది. అదే జేడీయూ పోటీచేసిన 101 స్థానాల్లో మూడొంతుల నియోజకవర్గాల్లో ఆర్జేడీ ఓటు బదిలీ పరిపూర్ణంగా జరిగింది. ఫలితంగా జేడీయూ 71 స్థానాల్లో గెలిచింది. దీన్నిబట్టి చూస్తే... బీజేపీ లేదా ఆర్జేడీలకు జేడీయూ అవసరం ఉందనేకంటే, నితీశ్‌కే ఈ రెండు పార్టీల్లో ఏదో ఒకదానితో జతకట్టాల్సిన అవసరం ఎక్కువ. పొత్తుల్లేకుండా జేడీయూ సొంతబలంపై గెలిచే పరిస్థితి ఎన్నడూ లేదు.
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement