
ఫెయిర్‌ఫాక్స్ చేతికి బ్లాక్‌బెర్రీ
ఒట్టావా: ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్ల రాజ్యాన్ని ఏలి... రానురాను మసకబారుతున్న బ్లాక్‌బెర్రీ సంస్థ చేతులు మారుతోంది. దీన్ని 4.7 బిలియన్ డాలర్లకు ఫెయిర్‌ఫాక్స్ కన్సార్షియం కొనుగోలు చేయనుంది. గతవారం భారీ ఎత్తున నష్టాలను ప్రకటించిన బ్లాక్‌బెర్రీ... అప్పటి నుంచే వ్యూహాత్మక ప్రత్యామ్నాయాలను వెదకటం ప్రారంభించింది. చివరికి 4.7 బిలియన్ డాలర్లకు ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్‌తో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు సోమవారం ప్రకటించింది. మన కరెన్సీలో ఇది దాదాపు రూ.30 వేల కోట్లకు సమానం.
ఈ మేరకు రెండు సంస్థలూ లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకాలు చేశాయి. విలువకు సంబంధించి నవంబరు 4లోగా నిజ నిర్ధరణ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ మధ్యలో మరింత మంచి ఆఫర్ల కోసం బ్లాక్‌బెర్రీ వెతుక్కునే అవకాశమూ దీన్లో ఉంది. తాజా వార్తతో నాస్‌డాక్‌లో బ్లాక్‌బెర్రీ ధర సర్రుమని ఎగసింది. అయితే కొత్త భాగస్వామిని వెతుక్కుని బ్లాక్‌బెర్రీ గనక ఈ డీల్‌కు గుడ్‌బై చెబితే... అది షేరుకు 0.30 డాలర్ చొప్పున ఫెయిర్‌ఫాక్స్‌కు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే బ్లాక్‌బెర్రీలో ఫెయిర్‌ఫాక్స్‌కు 10 శాతం వాటా ఉంది. ఈ డీల్‌కు బ్యాంక్ ఆఫ్ అమెరికా, మెరిల్ లించ్, బీఎంఓ క్యాపిటల్ మార్కెట్స్ కలిసి రుణం అందిస్తాయని బ్లాక్‌బెర్రీ ఒక ప్రకటనలో తెలిపింది.
రీసెర్చ్ ఇన్ మోషన్ పేరును బ్లాక్‌బెర్రీగా మార్చుకున్న ఈ సంస్థ కొన్నాళ్లుగా కొత్త ఫోన్లనైతే మార్కెట్లోకి విడుదల చేస్తోంది తప్ప అవి పెద్దగా సక్సెస్ కావటం లేదు. యాపిల్, శాంసంగ్, ఇంకా ఇతర చౌక మొబైల్ కంపెనీల నుంచి ఎదురవుతున్న పోటీతో తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటోంది. చివరకు మేనేజ్‌మెంట్ స్థాయిలో మార్పులు చేసింది. క్యు10, జెడ్10 సిరీస్‌లో కొత్త ఫోన్లు తెచ్చింది. అవి కొంత ఫలితం ఇచ్చినా... అప్పటికే విడుదల చేసిన పలు మోడళ్లు మార్కెట్లో అమ్ముడుకాక డీలర్ల వద్ద పేరుకుపోయాయి. దీంతో బిలియన్ డాలర్ల మేర నష్టాలు ప్రకటించవచ్చని ముందే తెలిపింది కంపెనీ. దీనికితోడు సిబ్బందిలో 40 శాతాన్ని... అంటే దాదాపు 4,500 మందిని తొలగించే అవకాశముందని కూడా తెలియజేసింది. దీంతో కంపెనీ చేతులు మారటం ఖాయమని స్పష్టమైపోయింది. అయితే ఎవరు కొంటారన్న ప్రశ్నలకు తాజా డీల్‌తో సమాధానం లభించినట్లయింది.