ఇక బోగస్ రిజిస్ట్రేషన్లు రద్దు!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు, స్థలాల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో అక్రమాలు కూడా అదేస్థాయిలో పెరుగుతున్నాయి. విలువైన భూములను తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇలాంటి బోగస్ రిజిస్ట్రేషన్లతో సామాన్యులు ఎన్నో ఇబ్బందులెదుర్కొంటున్నారు. వీటివల్ల భూవివాదాలు చోటుచేసుకుంటున్నాయి. వారసత్వంగా వస్తున్న స్థలాలు అక్రమార్కుల పాలవడంతో ఆత్మహత్యలు చేసుకున్నవారెందరో ఉన్నారు.
తప్పుడు పత్రాలతో జరిగిన రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడంతో కబ్జారాయుళ్ల ఆటలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కొందరు కేటుగాళ్లు ఇతరుల ఆస్తులను తప్పుడు పత్రాలతో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇకపై ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. బోగస్ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి దక్కేలా చర్యలు చేపడుతున్నారు.
రాష్ట్రపతి ఆమోదం అవసరం
తప్పుడు పత్రాలతో జరిగే రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కేంద్ర రిజిస్ట్రేషన్ చట్టాలనే రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. బోగస్ రిజిస్ట్రేషన్ల వల్ల మోసపోయినవారికి ఇప్పుడు అందుబాటులో ఉన్న ఏకైక మార్గం న్యాయస్థానాలను ఆశ్రయించడమే. ఈ నేపథ్యం లో తప్పుడు రిజస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం పొందాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ అనుమతిలో మధ్యప్రదేశ్ సర్కారు ఇలాంటి అధికారాన్ని గతంలోనే పొందింది. ఇదే తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా సంబంధిత ఫైల్‌ను సిద్ధం చేసింది. న్యాయశాఖ పరిశీలన అనంతరం ఈ ఫైల్‌ను కేంద్ర హోంశాఖ అమోదానికి పంపనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలి పారు. కేంద్ర హోంశాఖ ఆమోదం తరువాత రాష్ర్టపతి ఆమోదం పొందాల్సి ఉంటుందని చెప్పారు.
కేంద్రం సుముఖత
బోగస్ రిజస్ట్రేషన్లను రద్దు చేసే అధికారాలను రాష్ట్రాలకు ఇస్తే అధికారంలో ఉండే పార్టీ ఇతర పార్టీలకు చెందిన వారిని వేధించే అవకాశం ఉంటుందనే భావనతో కేంద్రం గతంలో ఈ వెసులుబాటు కల్పించలేదు. అయితే, ప్రస్తుతం ఇందుకు సముఖంగానే ఉంది. ఈ మేరకు చట్టంలో సవరణలు తీసుకురావాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ సవరణలకు సమయం పడుతుందని, అందుకే మధ్యప్రదేశ్ తరహాలో ఈ అధికారం పొందడానికి ప్రయత్నిస్తున్నామని అధికార వర్గాలు వెల్లడించాయి.