అఫ్ఘానిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు శనివారం ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఎనిమిది మంది పిల్లలు సహా 12 మంది మరణించగా.. ముగ్గురు అఫ్ఘాన్ పోలీసులు సహా 24 మందికిపైగా గాయపడ్డారు. ఈ దాడిలో రాయబార కార్యాలయ సిబ్బంది ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు.
పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ పెంచిపోషిస్తున్న హక్కానీ నెట్‌వర్క్ ఈ దాడికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు. అఫ్ఘానిస్థాన్‌లోని భారత రాయబార కార్యాలయాలపై ఉగ్రవాద దాడులు జరగవచ్చని నిఘావర్గాల సమాచారం మేరకు.. ఇటీవలే కాబూల్‌కు ఒక ప్రత్యేక భద్రతా బృందాన్ని భారత్ పంపింది. ఈ నేపథ్యంలోనే బాంబు దాడి జరగడం గమనార్హం. భారీగా పేలుడు పదార్థాలను తీసుకుని ముగ్గురు ఉగ్రవాదులు.. జలాలాబాద్‌లోని భారత రాయబార కార్యాలయం వైపు ఒక కారులో దూసుకువచ్చారు. అక్కడ విధుల్లో ఉన్న అఫ్ఘాన్ పోలీసులు వారిని అడ్డుకోవడంతో కాల్పులు ప్రారంభించారు. భారీగా పేలుడు పదార్థాలను ధరించిన ఇద్దరు ఉగ్రవాదులు కారు దిగి రాయబార కార్యాలయం వైపు దూసుకుపోవడానికి ప్రయత్నించగా భద్రతా సిబ్బంది కాల్చేశారు. దాంతో మరో ఉగ్రవాది కారులో ఉన్న బాంబులను పేల్చేశాడు. అదే సమయంలో సమీపంలోని మసీదుకు వెళుతున్న చిన్నారులతోపాటు, వీసాల కోసం వచ్చినవారు మృత్యువాత పడ్డారు. పేలుడు ధాటికి నేలపై పెద్ద గొయ్యిపడింది. అయితే.. భారత అధికారులకు, రాయబార కార్యాలయానికి ఎటువంటి నష్టం జరగలేదని ఢిల్లీలోని భారత అధికారవర్గాలు వెల్లడించాయి. రాయబార కార్యాలయంపై ఆత్మాహుతి దాడుల వంటి ఘటనలతో భారత్ భయపడబోదని, అఫ్ఘానిస్థాన్ పునర్నిర్మాణం కోసం తాము అందిస్తున్న సాయం కొనసాగుతుందని భారత విదేశాంగశాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పేర్కొన్నారు.
అఫ్ఘాన్‌లో భారత ఎంబసీపై ఆత్మాహుతి దాడి
Published Sun, Aug 4 2013 4:45 AM | Last Updated on Fri, Sep 1 2017 9:37 PM
Advertisement
Advertisement